అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెం సముద్ర తీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు భారీ చేప చిక్కంది. ఆ చిక్కి న ముక్కుడు టేకు చేప సుమారు 1500 కేజీలకు పైనే బరువు ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. సోమవారం జాలర్ల వేటలో ఈ టేకు చేప వలకు చిక్కింది. దాన్ని పడవలో ఎక్కించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్య పడలేదు. దానితో ఆ చేపకు పెద్ద తాడు కట్టి దాన్ని పడవకు చుట్టి అతి కష్టం మీద ఒడ్డుకు చేర్చాల్సి వచ్చింది. అక్కడ మత్స్యకారుల సహాయంతో బయటకు తీసుకొచ్చారు. ఈ టేకు చేపను విక్రయిస్తే సుమారు రూ. 50 వేల వరకు వస్తుందని మత్స్యకారులు చెప్పారు. భారీ సైజులో ఉన్న ఈ టేకు చేపను చూడడానికి అక్కడ జనాలు ఎగబడ్డారు. అంతేకాకుండా ఇంత పెద్ద చేపలను చూడటం ఇదే మొదటి సారని బంగారమ్మపాలెం వాసులు చెబుతున్నారు. ఎప్పుడో ఇలా ఒకటి అరా పెద్ద పెద్ద చేపలు చిక్కుతుంటాయని చెప్పుకొచ్చారు.