విజయనగరం జిల్లాలో సమగ్ర భూముల రీసర్వేను నెలాఖరులోగా పూర్తిచేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి రెవిన్యూ అధికారులు, సర్వే సిబ్బందిని ఆదేశించారు. భూముల రీసర్వే జరుగుతున్న తీరును పరిశీలించే నిమిత్తం జిల్లా కలెక్టర్ బుధవారం పూసపాటిరేగ, డెంకాడ మండలాల్లో పర్యటించారు. పూసపాటిరేగ మండలం లంకలపల్లి పాలెం, డెంకాడ మండలం గంట్లాంలో రీసర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అవసరమైన సంఖ్యలో గ్రామ సర్వేయర్లను డిప్యూటేషన్‌పై రీసర్వే పనుల కోసం నియమించినందున వారి సేవలను వినియోగించుకొని త్వరగా సర్వే పూర్తిచేయాలని ఆదేశించారు. డెంకాడ మండలంలో రెండు బృందాలతో రీసర్వే జరుగుతున్నట్టు తహశీల్దార్ ఆదిలక్ష్మి వివరించారు. పది గ్రామాల్లో పూర్తిచేశామని, మరో 16 గ్రామాల్లో పూర్తికావలసి వుందని వివరించారు. పూసపాటిరేగలో రీసర్వే జరుగుతున్న లంకలపల్లి పాలెంను సందర్శించి డిప్యూటీ తహశీల్దార్ ద్వారా మండలంలో జరుగుతున్న సర్వే గురించి తెలుసుకున్నారు.