ఆర్థిక సంవత్సరం ముగింపునేపద్యంలో గురువారం శ్రీరామనవమి సెలవు అయినప్పటికీ పన్నులు స్వీకరిస్తామని కాకినాడ నగరపాలకసంస్థ అదనపు కమిషనర్ సిహెచ్ నాగనరసింహారావు తెలిపారు. ఈ మేరకు కాకినాడలో బుధవారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. పన్నులు చెల్లింపునకు రెండు రోజులు మాత్రమే గడువు ఉన్నందున కాకినాడలోని అన్ని సచివాలయాల్లోను ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్ను, కుళాయి పన్నులను స్వీకరించేలా ఏర్పాటు చేశామన్నారు. సచివాలయాలతోపాటు ప్రస్తుత నగరపాలక సంస్థ కార్యాలయం(స్త్రీ శక్తి భవన్), సినిమా రోడ్డులోని పాత కార్పొరేషన్ భవనంలోని కౌంటర్లలో కూడా పన్నులు చెల్లించవచ్చునన్నారు. వడ్డీ, అపరాధ రుసుము లేకుండా ఈ నెల31వ తేదీలోపుగా పన్నులు చెల్లించాలని ఆయన పన్ను చెల్లింపుదారులను కోరారు. సెలవు రోజైనా సిబ్బంది అన్నిచోట్లా అందుబాటులో ఉంచినట్టు ఏడిసి ఆ ప్రకటనలో తెలియజేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.