శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వయంభూ కాకినాడ భోగిగణపతి పీఠంలో భద్రాచల శ్రీరామ పాదుకలకు విశేష పూజలు నిర్వహించారు. సీతా రామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలతో మామిడాకుల తోరణాలు ప్రతిష్ఠాలంకరణ చేపట్టారు. సహస్ర నామావళి ప్రధానంతో పానకం వడపప్పు పనసతొనల నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా పీఠం ఉపాసకులు దూసర్ల పూడి రమణరాజు మాట్లాడుతూ, భద్రాచల పాదయాత్రలో ప్రత్యేకంగా గుమ్మడి చెక్కతో తయారుచేసి శిరస్సు మీద వుంచి తీసుకువెళ్లిన శ్రీరామ పాదుకలు భద్రాద్రి రామాలయం గర్భాలయంలో శ్రీరాముల వారి పాదాల చెంతవుంచి ప్రత్యేక పూజలు చేసి తెచ్చిన తరువాత భోగిగణపతి పీఠంలో ఉంచి నిత్య పూజ జరుగుతున్నదని తెలిపారు. ప్రతి ఏటా శ్రీరామనవమి కి విశేష పూజ నిర్వహిస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని స్వామివారి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలియజేశారు.