చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా అహింసా వాదాన్ని, సత్యం, ప్రేమ తత్వాన్ని బోధించిన మహావీర్ బోధనలు ప్రతి వ్యక్తి ఉన్నతికి దోహదపడతాయని గురు స్వామి గల్లా సుబ్బారావు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ శ్రీరామ నామ క్షేత్రం, ఆంధ్ర భద్రాద్రి ఆధ్వర్యంలో మహావీర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ కుటుంబంలో చైత్రమాసం శుక్ల పక్షం త్రయోదశి రోజున మహావీర్ జన్మించారని, సత్యాన్వేషణ కోసం తన 30వ ఏటనే రాజ సింహాసనాన్ని, కుటుంబాన్ని విడిచిపెట్టారని అన్నారు. 36వ ఏట సన్యాసాన్ని స్వీకరించగా 43వ ఏట జ్ఞానోదయం పొందారని అన్నారు. 32 సంవత్సరాల పాటు అహింస, ధర్మం గురించి ప్రచారం చేసిన మహావీరుడు జైనులకు ఆరాధ్య దైవం అయ్యారని అన్నారు. 72వ ఏట ఆయన తుది శ్వాస విడిచారని సుబ్బారావు తెలిపారు. క్షేత్ర అధ్యక్షులు రాజా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, ఎస్. శ్రీ నగేష్, ఓదూరి వరలక్ష్మి , పి .పార్థసారథి, అడబాల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.