భవన నిర్మాణాలు జాప్యంచేస్తే కఠిన చర్యలు


Ens Balu
5
Paderu
2023-06-06 13:33:33

అంగన్వాడీ భవన నిర్మాణాలలో జాప్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐటిడిఏ పి ఓ వి. అభిషేక్ హెచ్చరించారు. ఐటిడిఏ సమావేశ మందిరంలో పాడేరు డివిజన్ పరిధిలో అంగన్వాడీ భవన నిర్మాణాలు నాడు నేడు పనుల పురోగతిపై సిడిపిఓలు, సూపర్ వైజర్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 128 కొత్త అంగన్వాడీ భవన నిర్మాణాలకు అనుమతులిచ్చి ప్రభుత్వం రివాల్వింగ్ ఫండ్ విడుదల చేసిందన్నారు. 2వ విడత రివాల్వింగ్ ఫండ్ జమచేశామని.. నేటికి గోతులు, గొయ్యిలు స్థాయిలోనే నిర్మాణపు పనులు ఉన్నాయన్నారు. 20 భవనాలు మాత్రమే రూఫ్ స్థాయి పనులు పూర్తి చేసారని అసంతృప్తి వ్యక్తం చేసారు. పాడేరు నియోజక వర్గంలో 15 అంగన్వాడీ కేంద్రాలు, అరకువ్యాలీ నియోజక వర్గంలో 30 అంగన్వాడీ కేంద్రాలు పునాదుల స్థాయిలో ఉన్నాయన్నారు. అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలకు సిడిపిఓలు , సూపర్ వైజర్లు బాధ్యత వహించ వలసి ఉంటుందన్నారు. 

11 మంది సిడిపి ఓలు, 62 మంది సూపర్ వైజర్లు ఉన్నారని అన్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లను భవన నిర్మాణాల వేగంగా పూర్తి చేయడానికే ప్రభుత్వం నియమించిందని భవన నిర్మాణాలు నిర్ధేశించిన సమయానికి పూర్తి చేయాల్సిన బాధ్యత ఇంజనీరింగ్ అసిస్టెంట్లపైనే ఉందన్నారు. మహిళా పోలీసులు పనుల పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు. నాణ్యమైన భవన నిర్మాణ సామగ్రి కొనుగోలు చేయాలని స్పష్టం చేసారు. మన బడి నాడు నేడు పాఠశాలలకు సిమెంటు సరఫరా చేయడం జరిగిందని అవసరమైతే ఆయా పాఠశాలలను సిమెంటు తీసుకుని పనులు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్ పిడి ఎన్. సూర్యలక్ష్మి, గిరిజన సంక్షేమశాఖ ఇ ఇ డి.వి.ఆర్.ఎం.రాజు, 11 మండలాల సిడిపిఓలు, సూపరిండెంట్ జి.ఆర్.సి.హెచ్.మూర్తి, సూపర్ వైజర్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.