నేరేడు పండు ఎంతో మంచి ఔషధాల గని..


Ens Balu
46
vizag
2023-06-10 10:06:39

నేరేడు వృక్షం భారతదేశం, పాకిస్థాన్, ఇండోనేషియాల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఫిలిపిన్స్, మయన్మార్, ఆఫ్ఘనిస్థాన్‌ల్లో కూడా అక్కడక్కడా కనిపిస్తుంది. పోర్చునీస్‌వారు ఇండియాకి వచ్చినప్పుడు ఈ విత్తనాన్ని బ్రెజిల్‌కు తీసుకెళ్లారు. ఈ చెట్టు చాలా వేగంగా పెరిగే గుణం కలిగి ఉంటుంది. సుమారు 30 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. నేరేడు చెట్లు 100 ఏళ్లకు పైగా జీవిస్తాయి. నేరేడు పండ్లలో చాలా రకాలున్నాయి. గుండ్రంగా పెద్దగా ఉండేవి, కోలగా ఉండి పెద్దగా ఉండేవాటిని అల్లనేరేడు అంటారు. గుండ్రంగా ఉండి చిన్నగా ఉన్నవాటిని చిట్టినేరేడు అని పిలుస్తారు. నేరేడు పండు తీపి, వగరు కలగలిపి ఉంటుంది. ఇది తిన్న తర్వాత నోరు వంగపువ్వు రంగులోకి మారుతుంది. నేరేడు పోషకాల గని. సర్వరోగనివారిణి. పండు మాత్రమే కాకుండా ఆకులు, బెరడు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆక్సాలిక్ టాన్మిక్ ఆమ్లం, విటమిన్లు, క్రోమియం పుష్కలంగా ఉన్నాయి. రామాయణంలో శ్రీరాముడు పధ్నాలుగేళ్ల వనవాసంలో ఈ పండ్లతోనే కాలం గడిపాడని భారతీయుల విశ్వాసం. అందుకే గుజరాత్‌లో ఈ పండును దేవతాఫలం అని పిలుస్తారు. ఈ చెట్టు కలపను ఫర్నీచర్ చేయడానికి ఉపయోగిస్తారు. నేరేడు గుజ్జుతో పచ్చళ్లు, జామ్‌లు, రసాలు, జెల్లీలు, వైన్, వెనిగర్‌లను తయారు చేస్తారు.

**ఔషధంగా ఉపయోగాలు** 1) ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి. 2) నేరేడు రసాన్ని నిమ్మరసంతో కలిపి తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. 3) జిగట విరేచనాలతో బాధపడేవారు 2 మూడు చెంచాల నేరేడు పండ్ల రసాన్ని తీసుకోవాలి. 4) జ్వరంగా ఉంటే ధనియాల రసంలో నేరేడు 
రసం కలిపి తీసుకుంటే శరీర తాపం తగ్గుతుంది. 5) మూత్రంలో మంట తగ్గాలంటే నిమ్మరసం, నేరేడురసం కలిపి తీసుకోవాలి. 6) మధుమేహ రోగులు గింజలను ఎండబెట్టి పొడిగా చేసుకుని నీటిలో కలుపుకుని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి. 7) నేరేడు పళ్లు తినేవారిలో పళ్లు చిగుళ్లు బలంగా ఉంటాయి. గాయాలు త్వరగా మానతాయి. రక్తాన్ని శుద్ధిచేసే గుణం కలది. 8) కాలేయం పనితీరును మెరుగుపరచడంతో పాటు బ్లడ్ కేన్సర్ కారకాలను నిరోధిస్తాయని అధ్యయనాల్లో తేలింది. 9) నేరేడు ఆకులు యాంటీ బాక్టీరియల్ గుణాలు కలిగిఉంటాయి. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. 10) నెలసరి సమస్యలకు నేరేడు చెక్క కషాయాన్ని 25 రోజుల పాటు 30 ఎంఎల్ చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 11) భోజనం అయ్యాక గంట తర్వాత తింటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. 12)ఈ పండు గింజలను ఆయుర్వేదం, యునానీ, చైనీస్ వైద్యంలో జీర్ణశక్తికి సంబంధించిన వైద్యానికి  ఉపయోగిస్తారు. 13) ఈ పండు అధిక భరువుని తగ్గిస్తుంది అందుకే దీనిని వేసవిలో సీజనల్ వెయిట్ లాస్ ఫ్రూట్ గా తీసుకుంటారు. 14)రక్తహీనత సమస్య ఉన్నవారు ఈపండును తీసుకోవడం ద్వారా శరీరంలో ఇనుముశాతం పెరిగి లోపాన్ని తగ్గించుకోవచ్చు. 15)పూజల్లో శనిదోష నివారణ పండుగా కూడా నేరేడుని వినియోగిస్తారు. శనిపూజల చేయించుకున్నవారు నేరేడు పళ్లను దానంగా ఇస్తారు.

** ముఖ్యమైన జాగ్రత్తలు* నేరేడు అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే ఉప్పు వేసి అప్పుడప్పుడు తీసుకోవాలి.  అధికంగా తింటే మలబద్దకంతో పాటు నోట్లో వెగటుగా ఉంటుంది. దీనికి విరుగుడు ఉప్పు, వేన్నీళ్లు తీసుకుంటే సరిపోతుంది.