దోమ కాటు ద్వారా సోకే మలేరియాను ప్రారంభ దశలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించవచ్చని డాక్టర్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో మలేరియా వ్యతిరేక మాసోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆడ అనాలసిస్ దోమ కుట్టినప్పుడు దాని శరీరంలోని ప్లాస్మోడియం సూక్ష్మజీవులు కాలేయంలో వృద్ధి చెంది ఎర్ర రక్తకణాలను దెబ్బతీస్తాయని అన్నారు. చలి, జ్వరం, తల నొప్పి, కండరాల నొప్పి, చాతిలో నొప్పి, దగ్గు, చెమటలు, వాంతులు, విరేచనాలు ,నీరసంగా ఉండటం ,ఆయాసం మలేరియా లక్షణాలని అన్నారు. దీని నివారణకు గాను ఇంటి పరిసరాల్లో దోమలు రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. దోమతెరలు వినియోగించాలని డాక్టర్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రేలంగి బాపిరాజు, రాజా తదితరులు పాల్గొన్నారు.