స్వచ్ఛ భారత్ అర్బన్ జాయింట్ కార్యదర్శి రూపామిశ్ర ఆదివారం నగరంలోని పలు ప్రాంతాలలో జివిఎంసి కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మతో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కాపులుప్పాడులోని జిందాల్ విద్యుత్ కేంద్రాన్ని, బయోమైనింగ్, ఘన వ్యర్ధాల విభజనతో పాటు ఋషికొండ, వైయస్సార్ వ్యూ పాయింట్, బీచ్ రోడ్ లోని వైఎంసిఏ వద్ద ఆధునికరించిన మోడ్రన్ మరుగుదొడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె హోటల్ ర్యాడిసన్ లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా ఏ అంశాలు, ఏ ఏ పనులు చేపడుతున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జివిఎంసి కమిషనర్ స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ఇప్పటివరకు చేపట్టిన పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అర్బన్ జాయింట్ సెక్రెటరీకి వివరించారు. ముఖ్యంగా ఘన వ్యర్ధాల విభజన, సేంద్రియ ఎరువు తయారీ, మెరుగైన పారిశుధ్యం, భూగర్భ మురుగనీటి వ్యవస్థ, నిషేధిత ప్లాస్టిక్ నిర్మూలన, కాలుష్యం నియంత్రణ, బహిరంగ మలమూత్ర విసర్జనతో పాటు సామూహిక మరుగుదొడ్లు పరిశుభ్రత పాటించడం తదితర అంశాలపై చర్చించిన అనంతరం ఆమె కొన్ని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి అదనపు కమిషనర్ డాక్టర్ వి.సన్యాసిరావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.