భారతీయ సంస్క్రుతిలో గోశాలను కూడా ఆలయంగానే చూస్తారని..అలాంటి గోశాల అమ్మవారి ఆలయంలో ప్రారంభం కావడం ఆనందంగా ఉందని ఆలయ అధ్యక్షులు బిళ్లపాటి కృష్ణకుమార్ అన్నారు. అనకాపల్లి గాంధీ మార్కెట్ సమీపంలోని శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవస్థాన ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన గోశాలను సోమవారం కమిటీ సభ్యులు ప్రారంభించారు. తొలుత గోశాలలో గోమాతను ప్రవేశింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాలు పొంగించి, లక్ష్మీ గణపతి హోమాలు, పూజలు జరిపారు. ఆలయ మండపంలో మహిళలు లలిత విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. తదనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గోపూజ చేసుకు భక్తులు ఆలయానికి తరలి రావాలని ఈ సందర్భంగా కార్యదర్శి కొరుపోలు జగదీశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి శ్రీధరాల సోమరాజు, ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్ప ల శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.