జివిఎంసీ పరిధిలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతల కల్పనే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె 8వ జోన్ 90వ వార్డు పరిధిలోని లక్ష్మీనగర్, కాకాని నగర్, విమాననగర్ తదితర ప్రాంతాలలో సుమారు రూ.45.48 లక్షలతో సిసి రోడ్లు, సిసి కాలువల నిర్మాణానికి పశ్చిమ నియోజకవర్గం సమన్యకర్త ఆడారి ఆనంద్, వార్డ్ కార్పొరేటర్ బొమ్మిడి రమణతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో విశాఖ నగరం ఎంతో అభివృద్ధి చెందుతుందని జీవీఎంసీ పరిధిలో ప్రతి వార్డును మోడల్ వార్డుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసామన్నారు. వార్డు కార్పొరేటర్ విన్నపం మేరకు 90 వార్డులో ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, లక్ష్మీ నగర్ లో రూ. 17.2 0 లక్షల వ్యయంతో సీసీ డ్రైన్ నిర్మాణానికి, కాకానినగర్ లో రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి, విమాన నగర్ లో రూ. 18.28 లక్షల వ్యయంతో సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. అలాగే రానున్న రోజుల్లో వార్డులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, కార్యనిర్వహణ ఇంజనీర్ సంతోషి కుమారి, సహాయ ఇంజనీరు, సచివాలయం సెక్రటరీలు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.