రాష్ట్రంలో నిర్మాణ రంగానికి ప్రభుత్వం చేయూత


Ens Balu
1
Visakhapatnam
2023-06-16 08:34:49

 రాష్ట్రంలో నిర్మాణ రంగానికి ప్రభుత్వం చేయూతను అందించడానికి సిద్ధంగా ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. విశాఖలోని గాదిరాజు ప్యాలెస్ లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం చాప్టర్ ఏర్పాటుచేసిన కాంటక్ ఎక్స్పో-2023ని మంత్రి అమర్నాథ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ తరువాత ఇప్పుడిప్పుడే నిర్మాణం పుంజుకుంటుందని అందుకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటు లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. విశాఖ దేశంలోని 8 వ అతిపెద్ద నగరంగా, జనాభా పరంగా పదవ నగరంగా, 9వ సంపదమంతమైన నగరంగా ఖ్యాతిని అర్జించిందన్నారు. ఈ నగరాన్ని మెట్రోపాలిటన్ సిటీగా తీర్చిదిద్దాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. దేశంలో ప్రముఖ నగరాలు అభివృద్ధిలో బిల్డ ర్స్ అసోసియేషన్ పాత్ర కీలకంగా ఉందని, విశాఖ అభివృద్ధికి కూడా బిల్డర్స్ అసోసియేషన్ పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. నిర్మాణ రంగంలో రానున్న 2 సంవత్సరాలలో 1.2 ట్రిలియన్ డాలర్లు వెచ్చించనున్నారని మంత్రి అమర్నాథ్ చెప్పారు. ఇందులో 250 సెక్టర్లు ముడిపడి ఉన్నాయన్నారు.

 నిర్మాణరంగంలో సాంకేతికత ట్రాన్స్ఫార్మింగ్ అవుతోందని 2000 కోట్లు పెట్టుబడితో నిర్మాణం చేపడుతున్న ఒక సంస్థ కేవలం 600 మంది కార్మికులను మాత్రమే వినియోగించుకుంది అంటే సాంకేతిక పరిజ్ఞానం ఏ మేరకు పెరిగిందో అర్థం చేసుకోవాలన్నారు. ఆయా పరిశ్రమలకు అవసరమైన స్కిల్డ్ లేబర్ ను అందుబాటులోకి తెచ్చేందుకు 192 స్కిల్ హబ్బులను ఏర్పాటు చేశామని అమర్నాథ్ వెల్లడించారు. కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులను వీలైనంత త్వరగా మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అమర్నాథ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో బిఎఐ చైర్మన్ కే వెంకటేశ్వర్లు, బి ఏ ఐ ఏపీ చైర్మన్ బి. రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.