ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు నగర మేయర్ గొలగాని హరి వెంకట్ కుమారి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె 8వ జోన్ 95వ వార్డు పరిధిలోని సుజాతనగర్ లో పబ్లిక్ పార్క్ ఆధునీకరణ పనులకు పెందుర్తి శాసనసభ్యులు అన్నమరెడ్డి అదీప్ రాజ్, వార్డ్ కార్పొరేటర్ ముమ్మన దేముడుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు వార్డులో పార్కుల అభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరుగుతుందని, అందులో భాగంగా జీవీఎంసీ జనరల్ నిధుల నుండి రూ. 82.20 లక్షల వ్యయంతో పబ్లిక్ పార్క్ ను అభివృద్ధి పరిచేందుకు శంకుస్థాపన చేస్తామన్నారు. పిల్లలు యువకులు వృద్దులు అందరికీ ఉపయోగపడే విధంగా వాకింగ్ ట్రాక్, పిల్లల ఆడుకునేందుకు సామగ్రి, జిమ్, షటిల్ కోర్ట్, మరుగుదొడ్లు, వాచ్మెన్ గది లాంటి మౌలిక వసతులు పార్కులో ఏర్పాటు చేశామన్నారు.
కాలుష్య నియంత్రణకు పార్కులు ఎంతో ఉపయోగపడతాయని ప్రతి వార్డులో ఇటువంటి పార్కులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
అనంతరం పెందుర్తి ఎమ్మెల్యే మాట్లాడుతూ, విశాఖ నగరంలోని పెందుర్తి నియోజకవర్గం లో జీవీఎంసీ నిధులతో ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి సారథ్యంలో ఎమ్మెల్యే నిధులతో పెందుర్తి నియోజకవర్గాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమీషనర్ మల్లయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.