ఆముదాలవలస నియోజకవర్గం పరిధిలో రహదారులు,ప్రభుత్వ భవన నిర్మాణాల విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు చేపట్టాలని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం సూచించారు. అధునాతన వస్తు సామాగ్రి,టెక్నాలజీ వినియోగించడం ద్వారా రహదారుల నిర్మాణాలు, భవనాల నిర్మాణాలు ఎక్కువ కాలం మన్నికలో ఉండటం సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం రహదారుల భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఐ వి ఎస్ జగన్నాథం శుక్రవారం సభాపతి ని గౌరవపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ రహదారులు తో పాటు, వంతెనలు,భవనాలు నిర్మాణాల పనులు వేగవంతం అయ్యేలా చూడాలని కోరారు. పనులపై పటిష్టమైన పర్యవేక్షణ ద్వారా నాణ్యత ప్రమాణాలు సాధ్యమన్నారు.
తన నియోజకవర్గ పరిధిలో నిర్మాణంలో ఉన్న బలసల రేవు వారధి నిర్మాణం, శ్రీకాకుళం నుండి ఆముదాలవలస వరకు నాలుగు లైన్ల రహదారుల నిర్మాణం, పురుషోత్తపురంలో గల సి హెచ్ సి భవనాలు తో పోటు, రహదారుల భవనాల శాఖ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. రహదారులు నిర్మాణాలు.. జాతీయ రహదారులు నిర్మాణానికి ఏ మాత్రం తీసి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో రోడ్డు నెట్వర్క్ విస్తరణలో ప్రధానంగా దృష్టి సారించాలని కోరారు. రోడ్ల విస్తరణ ద్వారా గ్రామీణ ప్రాంతాలను ముఖ్య పట్టణాలకు అనుసంధానం చేయడం ద్వారా రవాణా వ్యవస్థ మెరుగవుతుందన్నారు.ఈ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.అవసరమయ్యే చోట్ల పనులు గుర్తించడం, డి పి ఆర్ లు పూర్తిచేసుకుని అనుమతులు పొంది జరుగుతున్న రహదారుల పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడకుండా చూడాలన్నారు.