మాతా శిశు మరణాలు సంభవించడానికి వీల్లేదు


Ens Balu
4
2023-06-16 15:58:50

శ్రీకాకుళం జిల్లాలో మాతా శిశు మరణాలు సంభవించకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత పి.హెచ్.సి, సి.హెచ్.సి వైద్యులపై ఉందని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తేల్చిచెప్పారు. ఈ ఏడాది జనవరి నుండి ఏప్రిల్ వరకు వివిధ కారణాలతో సంభవించిన మాతా శిశు మరణాలపై కలెక్టర్ అరాతీశారు. మాతా, శిశు మరణాలకు గల కారణాలను సబ్ కమిటీ ద్వారా అడిగి తెలుసుకున్నారు. మాతా శిశు మరణాల్లో వైద్యుల నిర్లక్ష్యం లేనప్పటికీ, ఇటువంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని స్పష్టం చేశారు. ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు సమయపాలన పాటించడం లేదని, ఆదివారం మరియు సెలవు దినాల్లో వైద్యులు అందుబాటులో ఉండటం లేదనే ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయన్నారు. వైద్యులు తమకు కేటాయించిన విధులకు తప్పక హాజరుకావాలని, అలాగే సాయంత్రం 4గం.ల వరకు విధుల్లో ఖచ్చితంగా ఉండాలన్నారు. విధులకు గైర్హాజరైన, సమయపాలన పాటించని వారిపై చర్యలు తప్పవన్నారు.

జిల్లాలో మాతా శిశు మరణాల నివారణ, ఇతర అంశాలపై వైద్యాధికారులు, పి.హెచ్.సి,సి.హెచ్.సి వైద్యులు మరియు సిబ్బందితో జిల్లా కలెక్టర్ శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాతా, శిశు మరణాల నివారణకు వైద్యులు అంకిత భావంతో పనిచేయాలని, ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మరణాలు సంభవిస్తున్నాయనే భావన ప్రజల్లో ఉండరాదని హితవు పలికారు. మాతా, శిశు మరణాలు సంభవించడం బాధాకరమని, ఇకపై ఇటువంటివి పునరావృతం కారాదని హితవు పలికారు. హైరిస్క్ కేసులను ముందుగా గుర్తించి సాధ్యమైనంత మేరకు ప్రాణాలు కాపాడుటకు ప్రయత్నించాలని ఆయన చెప్పారు. తల్లిపాల ఆవశ్యకత పట్ల తల్లులకు వివరించాలని, ఈ విషయంలో ఏ.ఎన్.ఎంలు పూర్తిస్థాయిలో  అవగాహన కల్పించాలన్నారు. పి.హెచ్. సిలోని వైద్యాధికారుల ద్వారా ఏ.ఎన్ ఎం, ఆశావర్కర్లు మూడు మాసాలు పాటు అవగాహన కల్పించాలని సూచించారు.

 అలాగే పి.హెచ్.సి స్థాయిలో ప్రతి వారం సమావేశాలు ఏర్పాటుచేసి తల్లిపాలు ఆవశ్యకత పట్ల చైతన్య పరచాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. బి.మీనాక్షి, జిల్లా మాస్ మీడియాధికారి పి.వెంకట రమణ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.ఆర్.వి ఎస్.కుమార్,ఉప వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.లక్ష్మీ తులసి,రిమ్స్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి గైనికాలజిస్ట్ డా.పార్వతి, పి.హెచ్.సిలకు చెందిన వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.