ఆహ్లాదానికి పార్కులు ఎంతో ఉపయోగపడతాయని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. శనివారం ఆమె 3వ జోన్ 19వ వార్డు ఎంవిపి సెక్టార్ 2లో జీవీఎంసీ సాధారణ నిధుల నుండి సుమారు రూ.95 లక్షల వ్యయంతో బృందావనం చిల్డ్రన్ పార్కును రెయిన్ భో ధీమ్ పార్కుగా అభివృద్ధి చేసేందుకు తూర్పు నియోజకవర్గం అక్రమాని విజయనిర్మలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ఆహ్లాదానికి నగరంలో పార్కులు అవసరమని, పార్కులో అభివృద్ధికి జగనన్న ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. ఎంపీపీ సెక్టార్ 2 లో బృందావనం చిల్డ్రన్ పార్కును రెయిన్ భో ధీమ్ పార్కుగా ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించి శంకుస్థాపన చేసామన్నారు. రెయిన్బో ఆకారంలో వాకింగ్ ట్రాక్ను వినూత్నంగా ఏర్పాటు చేయడంతో పాటు, పెద్దల నుండి పిల్లల వరకు అందరికీ ఆహ్లాదం కల్పించేందుకు గ్రీనరీ, వ్యాయామ పరికరాలు, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్తు, సందర్శికులు కూర్చునేందుకు బెంచీలు, రక్షణ గోడ లాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. అనంతరం తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అక్కరమానివిజయనిర్మల మాట్లాడుతూ, తూర్పు నియోజకవర్గం పరిధిలో ప్రతి వార్డుకు ఒకటి లేదా రెండు పార్కులు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, అలాగే తూర్పు నియోజకవర్గ పరిధిలో ప్రతి వార్డును ఒక మోడల్ వార్డుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ పర్యవేక్షణ ఇంజనీరు సత్యనారాయణ రాజు, జోన్ల కమిషనర్ విజయలక్ష్మి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.