బడి ఈడు పిల్లలు, కౌమారదశలో ఉన్న వారందరికీ విద్యను పొందడం ప్రాథమిక హక్కు కాబట్టి ప్రతి ఒక్కరు సద్వినియోగపరుచుకుని ఉన్నత స్థితికి ఎదగాలని జిల్లా బాలల సంక్షేమ అధికారి సిహెచ్ వెంకట్రావు పేర్కొన్నారు. శనివారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పేదరికం తదితర కారణాలవల్ల పిల్లలు విద్యకు, అభ్యాసానికి దూరంగా ఉంటున్నారని అన్నారు. సెకండరీ స్థాయిలో బడి మానేస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంటుందని అన్నారు. బడికి పోని వారు లేదా బడికి వెళ్లి మధ్యలో మానేసిన వారు కూడా బడిలో చేరాలన్నారు. పిల్లలు బడి బయట ఉండకుండా విద్యాబుద్ధులు నేర్చుకునేటట్టు చూడటం తల్లిదండ్రుల బాధ్యత అని వెంకటరావు తెలిపారు. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే మొదటి ఆస్తి వారి చదువేనని సూచించారు. చదువు విషయంలో ప్రతీ తల్లిదండ్రులు పూర్తిగా చైతన్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, ఎస్. శ్రీ నగేష్, రాజా తదితరులు పాల్గొన్నారు.