గిరిప్రదక్షిణలో తాగునీరు, పారిశుద్ధ్యంపైనే ప్రత్యేక దృష్టి


Ens Balu
8
Visakhapatnam
2023-07-02 16:04:58

శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తామని జివిఎంసి కమిషనర్‌ సి.ఎం.సాయికాంత్‌ వర్మ  పేర్కొన్నారు. ఆదివారం ఆయన గిరి ప్రదక్షిణ మార్గంలో లోని పలు ప్రాంతాలను సందర్శించారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్యంపై దృష్టి సారించామని, ప్లాస్టిక్‌ నిషేధాన్ని పక్కాగా అమలు చేస్తామని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు, దాతలూ సహకరించాలన్నారు. భక్తులు సులువుగా ప్రదక్షిణ చేసి స్వామి వారిని దర్శించుకునేలా పోలీస్‌ శాఖ సహాయంతో అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుండడంతో పలు ప్రాంతాల్లో 20 డ్రోన్ల ద్వారా చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఆయా దృశ్యాలన్నీ జివిఎంసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటైన కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానమవుతాయి. దీంతో ఎక్కడెక్కడ ఏఏ లోటుపాట్లున్నాయి, వాటిని అధిగమించడం ఎలా అనే విషయమై పలువురికి సూచనలిచ్చారు. ప్రదక్షిణ ముగిసేంత వరకు కమాండ్‌ కంట్రోల్‌లో సిబ్బంది ఉంటారని, అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా కమిషనర్‌ ఆదేశించారు. సాయంత్రానికే లైటింగ్‌ సిద్ధం కావాలని, కొన్ని చోట్ల కొత్తగా రోడ్లేయడంతో వాటి పిక్కలు భక్తుల కాళ్లకు తగలకుండా క్రషర్ బూడిద వేయాలని సూచించారు. ఈ పర్యటనలో అదనపు కమిషనర్  డాక్టర్‌ వి.సన్యాసిరావు, ప్రధాన ఇంజనీరు రవి కృష్ణంరాజు, పట్టణ ప్రణాళిక అధికారి సునీత, మంచి నీటి సరఫరా విభాగ ఎస్‌ఈ వేణుగోపాల్‌, ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ నరేష్‌, ఆయా ప్రాంతాల జోన్ల కమిషనర్లు  తదితరులు పాల్గొన్నారు.