టమాటా దిగుబడి తగ్గి, మార్కెట్ లో ధరలు హాఠాత్తుగా పెరగడంతో.. వినియోగదారులకు సబ్సిడీ ధరపై టమాటాలు విక్రయించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. సోమవారం కొవ్వూరు పట్టణంలోని వాటర్ ట్యాంక్ వద్ద గల రైతు బజారులో సబ్సిడీ పై టమాటా విక్రయ కౌంటర్ ను ఆమె ప్రారంభించారు. అనంతరం టమాలను సబ్సిడీ ధరపై వినియోగదారులకు మంత్రి అందజేశారు. రూ.50 లకే నాణ్యమైన, స్వచ్చమైన టమాటాలు ప్రభుత్వం అందించడంతో మహిళలు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారని హోంమంత్రి తెలిపారు. నిత్యావసర ధరలను కంట్రోల్ చేయడానికి సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మొన్నటి వరకు ఎండలు, ఇప్పుడు భారీ వర్షాల కారణంగా టమాటా దిగుబడులు తగ్గాయని, దీంతో మార్కెట్లో టమాటా ధరలు ఆమాంతం పెరిగి కిలో ధర రూ.120 నుంచి రూ.150 లు ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలపై భారం పెరగకుండా చూసేందుకు ప్రభుత్వం సబ్సిడీ ధరల్లో టమాటాలు అందిస్తోందని హోంమంత్రి తానేటి వనిత వివరించారు. కొవ్వూరు రైతు బజారుకు సోమవారం సుమారు 800 కిలోల(30 ట్రేలు) నాణ్యమైన టమాటాలు దిగుమతి చేసుకున్నామని తెలిపారు. ఈసబ్సిడీ టమాటా పలమనేరు రైతులు నుండి స్వయంగా ప్రభుత్వం దిగుమతి చేసుకుంటుందని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.