దళితులపై దురాగతాలు సహించేది లేదు..


Ens Balu
3
Ravikamatham
2020-09-28 18:46:43

దళితుల పై దురాగతాలను చేపడితే ఉపేక్షించేది లేదని వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య హెచ్చరించారు. సోమవారం రావికమతం మండలంలోని గుమ్మళ్ళపాడు గ్రామాన్ని సందర్శించి అక్కడ దళితుల గ్రామ బహిష్కరణ పై విచారణ చేపట్టారు. అక్కడ జరిగిన విషయాలను గ్రామ ప్రజలతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ, దళిత సామాజిక వర్గానికి చెందిన యువతిని అగ్రవర్ణానికి చెందిన యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో సంబంధిత కుటుంబాలను గ్రామ బహిష్కరణ గావించడం ఎంతో విచారించదగిన విషయం అన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించడం జరుగుతుందని ఈ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. సంబంధిత కుటుంబాల వారికి కౌన్సిలింగ్ చేయాల్సిందిగా మండల అధికారులకు ఆదేశించారు. ఇటువంటి సంఘటనలు మరి ఏ మండలం లోనూ, గ్రామాలలో నూ పునరావృతం కాకూడదని, మరలా ఇటువంటి సంఘటనలు జరిగినట్లు తన దృష్టికి వస్తే సంబంధితులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ తో పాటు రావికమతం మండల తాసిల్దార్ కనకారావు, సీ ఐ లక్ష్మణ మూర్తి, ఎస్ ఐ చంద్రశేఖర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.