మానవత్వానికి, నిస్వార్ధ సేవకు ప్రతిరూపంగా మదర్ థెరిస్సా నిలుస్తారని రిటైర్డ్ అడిషనల్ డిఎంఅండ్ హెచ్వో డా.చింతాడ కృష్ణమోహన్ పేర్కొన్నారు. శనివారం శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరం స్వాతంత్ర్య సమరయోధుల స్మృతివనంలో భారతరత్న మదర్ థెరిస్సా 113వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహదాత కృష్ణమోహన్ మాట్లాడుతూ, విదేశాల్లో జన్మించిన మదర్ థెరిస్సా భారతదేశంలో పేదలు, నిరాశ్రయులు, నిర్భాగ్యులకు సేవలు అందించి అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ప్రముఖ విద్యావేత్తలు డా.నిక్కు అప్పన్న, బి.లక్ష్మణరావు మాట్లాడుతూ, మదర్ థెరిస్సాకు శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. అభాగ్యులకు సేవలందించి నోబుల్ శాంతి బహుమతితో పాటు భారతరత్న పొందిన మహోన్నత వ్యక్తి కొన్ని సంవత్సరాలు క్రితం జిల్లాలో పర్యటించడం గొప్ప విషయమన్నారు. అవధాన పండితులు పైడి హరనాధరావు మాస్టార్ మదర్ థెరిస్సా గొప్పతనం వివరించే గేయం ఆలపించారు. తొలుత మదర్ థెరిస్సా విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో గాంధీమందిర బృందం నటుకుల మోహన్, మహిబుల్లాఖాన్, నక్క శంకరరావు, పందిరి అప్పారావు, వావిలపల్లి జగన్నాథంనాయుడు, గుర్తు చిన్నారావు, తర్లాడ అప్పలనాయుడు, సువ్వారి రాజారావు, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.