భావితరాలకు మంచి భవిష్యత్తు నిచ్చేవారు ఉపాధ్యాయులు ఈరోజు కూడా వారికి వేతన వెతలు.. ఎదురుచూపులే మిగిలాయంటూ ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే "గంటా శ్రీనివాసరావు" మండి పడ్డారు. ఈ అరాచక వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా చేపడుతున్న చర్యల కారణంగా గురుపూజోత్సవ ఉత్సాహం వారిలో లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.‘నాడు-నేడు’ పనుల్లో ఎలాంటి పురోగతి లేకపోయినా వైఎస్సార్సీపీ నాయకులు చేస్తున్న తప్పులకు ఉపాధ్యాయులను బలి చేస్తున్నారని ఆరోపించారు. గౌరవమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులతో మరుగుదొడ్ల ఫొటోలు తీయిస్తూ.. ఆ ఫొటోలు ఆన్‌లైన్ పెట్టలేదని.. రాగిపిండి నిల్వ నమోదు చేయలేదని.. పాఠశాలల్లో కోడిగుడ్లు నిల్వ సరిగా లేదని.. షోకాజ్ నోటీసులిస్తూ ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండి పడ్డారు.
ఉపాధ్యాయుల బదిలీలు రికార్డు సమయంలో పూర్తి చేశామని డప్పులు కొడుతున్నా మీ ప్రభుత్వం.. బదిలీ అయున 30వేల మంది బదిలీ టీచర్లకు 3నెలలుగా జీతాలు వేసే సంగతి మాత్రం మరిచిపోయిందని ఎద్దేవా చేశారు. ఉపాద్యాయుల పైన రకరకాల ప్రయోగాలు చేసి పోస్టుల్లో గజిబిజి సృష్టించి, నెలలు గడుస్తున్నా లోపాలు సరిదిద్దకుండా మొత్తం మీద 1.70 లక్షల మంది టీచర్ల జీతాలకు ఎసరు పెట్టారని ఆరోపించారు. చదువు చెప్పించడం తప్ప అన్ని పనులూ ఉపాధ్యాయులతోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేయిస్తోందని గతంలో గౌరవ హైకోర్టు నే వ్యాఖ్యానించిందంటే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు పేర్కొన్నారు. కరోనా సమయంలో మద్యం దుకాణాల వద్ద కొనుగోలుదారులను వరసలో నెలబెట్టే బాధ్యత కూడా టీచర్లకే అప్పగించిన ఘనత.. సీపీస్ అడిగారని ఉపాధ్యాయులపై లాఠీ చార్జ్ చేయించిన ఘనత దేశ చరిత్రలో మీకే దక్కుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ట్వీట్ చేశారు.