అంతరిక్ష పరిశోధనల్లోకి యువత అడుగుపెట్టాలి


Ens Balu
17
Visakhapatnam
2023-10-05 06:32:25

అంతరిక్ష పరిశోధన రంగంలో యువత తమ సత్తా చాటాలని డీసీపీ-2 కె.ఆనంద రెడ్డి అన్నారు. వరల్డ్ స్పేస్ వీక్ లో భాగంగా షార్- ఇస్రో, రఘు విద్యాసంస్థలుసంయు క్తంగా  గురువారం ఉదయం ఆర్కే బీచ్ కాళీమాత విగ్రహం వద్ద నిర్వహించిన స్పేస్ వాక్ అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిసిపి ఆనందరెడ్డి మాట్లాడుతూ భారతీయ అంతరిక్ష పరిశోధనలతో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలుస్తూ అద్భుత విజయాలను సాధిస్తోందని అన్నారు. భవిష్యత్తులో దీనిని మరింత అభివృద్ధి చేసి, ముందుకు నడిపించే విధంగా యువతరం ఈ రంగంలో రాణించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో అంతరిక్ష పరిశోధనలపై అవగాహన పెంచే విధంగా ఇటువంటి ర్యాలీని నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో చంద్రయాన్ విజయం భారతీయుల్లో కొత్త శక్తిని, అంతరిక్ష పరిశోధనలపై యువతలో ఆసక్తిని కలిగించాయని అన్నారు. అంతరిక్ష విజ్ఞానం తోనే మానవ అభివృద్ధి సాకారం అవుతుందని షార్ శాస్త్రవేత్త, విశాఖ రీజియన్ కార్యక్రమ నిర్వహణ సబ్ కమిటీ చైర్మన్ జి .అప్పన్న అన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన పాఠశాలల విద్యార్థులను ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించామని తెలిపారు. భారతదేశం అంతరిక్ష రంగంలో సాధిస్తున్న విజయాలు నేటి తరం యువతలో ఆసక్తిని పెంచుతున్నాయని చెప్పారు.

రఘు విద్యాసంస్థల చైర్మన్ కలిదిండి రఘు మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు చెందిన పాఠశాలల, కళాశాలల విద్యార్థులు షార్ - ఇస్రో నిర్వహిస్తున్న నాలుగు రోజుల ప్రత్యేక కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సార్ ఇస్రో శాస్త్రవేత్తలు రఘు విద్యాసంస్థల జాతీయ సేవా పథకం ఎన్సిసి వాలంటీర్లు విద్యార్థులు, పోలీస్ అధికారులు, కళాశాల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ఆర్కే బీచ్ నుంచి వైఎంసిఏ వరకు ఫ్ల కార్డులు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించే పోస్టులను పట్టుకుని ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.