మన్యంలో నిండు గర్భిణిలకు డోలీమోతలే శరణ్యం


Ens Balu
25
Pedabayalu
2023-10-08 17:19:40

తరాలు మారుతున్నా కానీ గిరిజనుల తలరాతలు మాత్రం మారడం లేదు. ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గిరిజన గ్రామాల్లో తాగునీటి, రహదారి తదితర కనీస మౌలిక సౌకర్యాలు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు, కనీసం ఆసుపత్రికి వెళ్లాలంటే వారికి నరకయాతన తప్పడం లేదు. 
పెదబయలు మండలం గుల్లెలు పంచాయతీ పరిధిలోని పంచాయతీ రెంజలమామిడి గ్రామానికి చెందిన బొండా దేవకమ్మ అనే నిండు గర్భిణికి ఆదివారం పురుటి నొప్పులు వచ్చాయి. అయితే ఆ గ్రామానికి రహదారి సౌకర్యం లేక పోవడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తుల సహకారంతో డోలీమోతతో సుమారు 5 కిలోమీటర్లు దూరంలో ఉన్న రాయిమామిడి గ్రామానికి మోసుకొని వచ్చారు. అక్కడ నుంచి 108 వాహనంలో గోమంగి ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించాలంటే డోలీమోతలే శరణ్యమవుతున్నాయని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.