గిరిజన ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయికి చేరాలి


Ens Balu
7
Parvathipuram
2023-10-11 09:49:47

 గిరిజనులు పండించే పంటలు, ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి మార్కెట్ లో విక్రయాలు జరగాలని పార్వతీపురం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రోజెక్ట్ అధికారి సి.విష్ణుచరణ్ ఆకాంక్షించారు.  గిరిమిత్ర సమావేశ మందిరంలో గిరిజన కళాకారుల ఉత్పత్తుల మేళా కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రోజెక్ట్ అధికారి ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు పండించే పంటలు, ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉందని, అయితే దళారులు, మద్యవర్తుల ద్వారా సరైన ధరను పొందలేకపోతున్నారని గుర్తుచేశారు. ఇందుకోసం వన్ ధన్ వికాస్ కేంద్రాలు ( వి.డి.వి.కె ) లను జిల్లాలో ఏర్పాటుచేసి గిరిజన ఉత్పత్తులు మంచి ధరకు విక్రయించేలా చేసినట్లు చెప్పారు. తద్వారా తమ పంటలు, ఉత్పత్తులకు అధిక లాభాలను ఆర్జించి, ఆర్ధికంగా, సామాజికంగా ఎదిగేందుకు దోహదపడు తున్నట్లు తెలిపారు. జిల్లాలో 54 వరకు విడివికెలు ఉండగా, అందులో 34 మాత్రమే పనిచేస్తున్నాయని అన్నారు. గిరిజనుల ఉత్పత్తుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నివిధాలా సహకరిస్తున్నప్పటికీ కొన్ని విడివికెలు పనిచేయడం లేదని, వీటిపై అవగాహన పెంపొందించుకొని సంపూర్ణంగా వినియోగించు కునేలా చేయడమే దీని ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. విడివికెలను ప్రోత్సహించేందుకు ఒక్కో గ్రూపుకు లక్ష రూపాయల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామని, తద్వారా అధిక లాభాలను ఆర్జించాలన్నదే తమ ధ్యేయమని వివరించారు. అవసరమైతే మరిన్ని నిధులను వెచ్చేంచేందుకు సిద్ధంగా ఉన్నామని, తమకు నచ్చిన పనుల్లో పురోగతి సాధించాలని ఆయన కోరారు. గిరిజన ఉత్పత్తులకు రాష్ట్రంలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ కు చేరాలని ఆయన అభిలషించారు. ఇందుకు అవసరమైన సహకారాన్ని ట్రైఫెడ్ అందజేస్తుందని తెలిపారు. గిరిజనులకు అండగా ఐటిడిఏ ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం వివిధ విడివికెలు ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను సందర్శించారు.  ఈ కార్యక్రమంలో ట్రై ఫెడ్ ప్రాంతీయ మేనేజర్ ఎస్. శ్రీనివాస్, ఐటిడిఎ ఎపిఓ పి. మురళీధర్,గిరిజన సహకార సంస్థ డివిజనల్ మేనేజర్ వి. మహేంద్రకుమార్, ఏపిడి వై. సత్యనారాయణ, వివిధ విడివికె సభ్యులు తదితరులు పాల్గొన్నారు.