అర్జీదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, అన్ని శాఖలు చిత్తశుద్దితో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. ఫిర్యాదుదారులు శతశాతం సంతృప్తి చెందేవిధంగా వారి సమస్యను పరిష్కరించాలని సూచించారు. మండల స్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా, ఎల్‌కోట మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో బుధవారం స్పందన నిర్వహించారు. సుమారు 76 మంది తమ సమస్యలపై కలెక్టర్‌కు, జాయింట్ కలెక్టర్‌కు అర్జీలు అందజేశారు. వాటిని పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ, పోలీసు, పంచాయితీ, హౌసింగ్ పంచాయితీరాజ్ శాఖలకు సంబంధించి ఎక్కువగా వినతులు అందాయి.
ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ, అందిన ప్రతీ అర్జీని సమగ్రంగా పరిశీలించి, వారు పూర్తిగా సంతృప్తి చెందే విధంగా ఆ సమస్యను పరిష్కరించాలని సూచించారు. తమ శాఖకు సంబంధం లేదన్న కారణంతో వచ్చిన వినతులను తిరస్కరించకుండా, ఇతర శాఖలను సమన్వయం చేసుకొని వాటిని పరిష్కరించాలని స్పష్టం చేశారు. తోటి ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకొంటే, ఏ సమస్యనైనా సులువుగా పరిష్కరించవచ్చునని సూచించారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో జెకెసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, మరింత సమర్ధవంతంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో మండలాల్లో కూడా స్పందన ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అందువల్ల ప్రభుత్వం ఆశించిన లక్ష్యానికి తగ్గట్టుగా నాణ్యతతో పరిష్కారం చూపాలన్నారు. వచ్చిన వినతులపై తాశిల్దార్, ఎంపిడిఓ, ఎస్‌హెచ్ఓ తదితర మండల స్థాయి అధికారులు సంయుక్తంగా చర్చించి సమగ్రంగా పరిష్కరించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఆర్‌డిఓ ఎంవి సూర్యకళ, వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల ప్రత్యేకాధికారి శారదాదేవి, ఎంపిడిఓ రూపేష్, ఇన్‌ఛార్జి తాశిల్దార్ రాజేశ్వర్రావు, ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.