ఎంవిఆర్ ని కలిసిన వైఎస్సార్సీపీ మంత్రి విశ్వరూప్


Ens Balu
31
Anakapalle
2023-11-19 02:42:50

ప్రముఖ వ్యాపారవేత్త, సంఘ సేవకులు ముత్యాల వెంకటేశ్వరరావు (ఎం.వి.ఆర్) ను మంత్రి విశ్వరూప్ కలవడం చర్చనీయాంశమైంది. అనకాపల్లిలో గత కొంత కాలంగా ఎంవిఆర్ రాజకీయ ప్రవేశం గురించే చర్చ సాగుతోంది. మంత్రి విశ్వరూప్ శనివారం ఎంవిఆర్ స్వగృహంలో కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో  రాజకీయాలకు అతీతంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడంతో తలలో నాలుక లా ఎంవిఆర్ పేరు మార్మోగుతోంది. ఉచిత బస్సు యాత్ర లతో గ్రామీణ ప్రజలకు మరింత చేరువయ్యారనే చెప్పాలి. పేద విద్యార్థులకు కొంత వరకు ఆర్థిక సహాయం అందించడం ,కొన్ని దేవాలయ పునఃనిర్మాణాలకు విరాళాలు వంటి కార్యక్రమాలు చేపట్టడం ప్రజలకు చేరువ చేసింది. అంతేకాకుండా పేద, ధనిక భేదం లేకుండా అందరితో కలిసి పోయే వ్యక్తిత్వం  అనతికాలంలోనే అందరి హృదయాలను దోచుకున్నారని పలువురి భావన. ఇంతవరకు చాలా మంది రాజకీయ నాయకుల వ్యవహార శైలి కీ భిన్నంగా ఎంవిఆర్ రాజకీయ ప్రస్తానం ఉంటుందనే చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తయితే ఎంవిఆర్ రాజకీయ ప్రవేశం గురించి ఆయన అనుచరులకే అంతుపట్టని విధంగా ఉంది.  గ్రామాల్లో ఇప్పటికే ఎంవిఆర్ త్వరలో రాజకీయ ప్రవేశం అని అనుచరులు ఏర్పాటు చేసిన వాహనాలు ద్వారా విస్తృత ప్రచారం జరుగుతోంది.  వీటికి తోడు ఎంవిఆర్ రాజకీయ ప్రవేశ వాల్ పోస్టర్లు గ్రామాలలో చాలా చోట్ల వెలిచాయి. ఇంతటి పెద్ద ఎత్తున జరిగే ప్రసారమే ఎంవిఆర్ రాజకీయ ప్రవేశం గురించి చర్చ జరగడానికి  కారణమైంది.ఏదేమైనా ఎంవిఆర్ రాజకీయ ప్రస్తానం ఏ పార్టీతో ఉంటాదనేది త్వరలోనే తెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.