రైతుల అభ్యున్నతి కోసం చేపడుతున్న మిషన్ కర్షక దేవోభవ మరింతగా ప్రజల్లోకి వెళ్లాలని మిజోరామ్ గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు ఆకాంక్షించారు. శనివారం విశాఖలో మిషన్ కర్షకదేవోభవ విశేషాలను ఆడారి కిషోర్ కుమార్ ఆయనకు తెలియజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, గతంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పెద్ద స్థాయిలో చేపట్టిన అనుభవంతో మిషన్ కర్షక దేవోభవను కూడా దేశవ్యాప్తం చేయాలని ఆకాంక్షించారు. రైతే దేశానికి వెన్నుముఖ అని అలాంటి రైతుల కోసం మంచి ఆలోచనతో ఒక ఉద్యమం చేపట్టి గ్రామ స్థాయి నుంచే దానిని అమలు చేస్తుండటం శుభ పరిణామం అన్నారు. రైతులు నకిలీ విత్తనాలు,పురుగు మందుల విషయంలో మోస పోకుండా మంచి అవగాహన కార్యక్రమాలు కూడా చేపడితే మంచి ఫలితాలు వస్తాయని కిషోర్ కి సూచించారు. వ్యవసాయవిధ్య,పరిశోధనలవైపు విద్యార్ధులకు ఆశక్తి పెరిగే లా కూడా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అనంతరం కిషోర్ కుమార్ మాట్లాడుతూ, మిషన్ కర్షక దేవోభవలో మొదటి నుంచి విద్యార్ధుల భాగస్వామ్యం చేశామన్నారు. అంతేకాకుండా..త్వరలోనే వ్యవసాయ పరిశోధన కేంద్రాలను సందర్శించి అక్కడ కొత్తరకం వంగడాల విషయాలను తెలుసుకోవడంతోపాటు, వాటిని రైతులకు చేర్చే ఆలోచన కూడా చేస్తున్నామన్నారు. దండగ అనుకునే వ్యవసాయాన్ని పండుగలామార్చేందుకు మిషన్ కర్షక దేవోభవ శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని గవర్నర్ కు వివరించారు. అదేవిధంగా గవర్నర్ చేసిన అమూల్యమైన సూచనలు,సలహాలను తప్పక అమలు చేస్తామని కిషోర్ కుమార్ స్పష్టం చేశారు.