స్వఛ్చమైన పంటలను ప్రజలకు అందించి, ఆరోగ్యాన్ని కల్పించాలనే సంకల్పంతో విశాఖ లో ఆర్గానిక్ మేళా నిర్వహించడం అభినందనీయం అని మిషన్ కర్షక దేవోభవ జాతీయ చైర్మన్, టిడిపి యువ నాయకులు ఆడారి కిషోర్ కుమార్ అన్నారు. విశాఖలో జరుగునున్న ఆర్గానిక్ మేళాను పురస్కరించుకుని మంగళవారం విశాఖ బీచ్ రోడ్ లో నిర్వహించిన ఆరోగ్య పరుగులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు పండించే స్వచ్చమైన ఆరోగ్యకర పంటలను ఈ మేళా లో ప్రదర్శి స్తున్నారని తెలిపారు. ఆర్గానిక్ మేళా ఈ నెల 14 నుండి 17 వ తేదీ వరకు ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఇంజనీరింగ్ మైదానం లో జరుగుతోందన్నారు. ప్రకృతి ఆధారిత పంట లను విస్తారంగా పండించడం ద్వారా జల, వాయు, భూమి కాలుష్యం నివారించ వచ్చని వివరించారు. రసాయన ఎరువులు, రసాయన క్రిమిసంహారకాలు, రసాయన కలు పుతీత మందులు వినియోగించడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలుసుకున్న ప్రజలు ప్రకృతి ఆధారిత పంటలను ఆహారంగా తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ సదస్సులో 14వ తేదీ ఉత్తరాంధ్ర రైతుల సమావేశం, 15 వ తేదీ గ్రాడ్యుయేట్ రైతుల సమావేశం, 16 వతేది ఆర్గానిక్ వ్యాపారం చేసే వారితో సమావేశం, 17 వ తేదీ మిద్దె తోట రైతుల సమావేశం జరుగుతున్నాయన్నారు. ప్రతీ రైతూ సేంద్రియ వ్యవసాయం చేయడం మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మారుతుందనే ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గో ఆధారిత ప్రకృతి రైతుసంఘం , మేళా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.