విజెఎఫ్ ఎన్నికల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలి


Ens Balu
76
Visakhapatnam
2023-12-13 15:49:03

అర్హత లేని, నకిలీ జర్నలిస్టులను ఓటర్లుగా చూపుతూ.. జరుగుతున్న విజెఎఫ్ ఎన్నికల ప్రక్రియను అర్హులైన జర్నలిస్టులకు సభ్యత్వాలు ఇచ్చేవరకూ నిలుపుదల చేయాలంటూ జర్నలిస్టులు రోడ్డెక్కారు. బుధవారం ఈ మేరకు విశాఖజిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలియజేశారు. సీనియర్ జర్నలిస్టులు సత్యన్నారాయణ, రాము, పరశురామ్, శివ తదితరు ఆధ్వర్యంలో జరిగిన జర్నలిస్టుల నిరసనతో కలెక్టరేట్ ప్రాంగణం హోరెత్తింది. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ, అర్హత లేని జర్నలిస్ట్ లను వీజేఎఫ్ లో సభ్యులుగా చేర్చి వీజేఎఫ్ కున్న కోట్లాది రూపాయల ఆస్తిని కైవసం చేసుకోవడానికి కొంతమంది పన్నగం పన్నారని మండి పడ్డారు. సుమారు 140మందికి పైగా అర్హత లేనివారికి సభ్యత్వం ఇచ్చి, అర్హులైన జర్నలిస్టులకు సభ్యత్వాలు ఇవ్వకుండా కావాలనే అడ్డుకున్నారన్నారు.  

అనంతరం కలెక్టర్ మల్లిమార్జున్ ను కలిసి నకిలీ ఓట్లతో ఎన్నికలు జరిపుతున్న విధానాన్ని తెలియజేసి వినతి పత్రం సమర్పించారు. వీజేఎఫ్ ఆస్తులను కాజేసే కుట్ర జరుగుతుందని కలెక్టర్ కి  వివరించారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే నకిలీ ఓటరులు పై చర్యలు తీసుకుని ఈ రోజు సాయంత్రానికి తనకు రిపోర్ట్ ఇవ్వాలని  డిఐజీ స్టాంప్స్ బాలకృష్ణ కు ఆదేశాలు జారీ చేశారు. సొసైటీ యాక్డుకి విరుద్ధంగా జరుగుతున్న వీజేఎఫ్ ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాన్ని తెలియజేస్తూ, వీజేఎఫ్ లో జరిగిన అవకతవకలను నిగ్గు తేల్చాలని, గతంలో  వచ్చిన ఫిర్యాదుల మేరకు కలెక్టర్ ఆదేశాలతో ఏర్పాటైన కమిటీల నివేదికలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఓటరు జాబితా విడుదలైన రోజునే హడవుడిగా జారీ చేసిన వీజేఎఫ్ నోటిఫికేషన్ ను తక్షణమే రద్దు చేయాలన్నారు. లేని పక్షంలో ఆందోళన ఉదృతంగా చేయడంతోపాటు న్యాయపోరాటం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అక్రిడేటెడ్ జర్నలిస్టులు పాల్గొన్నారు.