ఆంధ్రప్రదేశ్ లోని పద్మశాలీ ఎంప్లాయిస్ వెల్పేర్ అసోసియేషన్(పెవా) ను అగ్రగామిగా నిలబెట్టడానికి అందరి కృషి అవసరమని అనకాపల్లి జిల్లా అధ్యక్షులు నీలంజోగిరాజు పేర్కొన్నారు. సోమవారం అనకాపల్లి జిల్లా, పాయకరావుపేటలోని తిరుమల ఆసుపత్రి ప్రాంగణంలో డా.కోడి నానాజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2024 కేలండర్, డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని పద్మశాలీ ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమం కోసం ఏర్పాటైన ఈ అసోసియేషన్ అంచెలంచలుగా అతిపెద్ద ఉద్యోగుల సంఘంగా అవతరించేందుకు కార్యాచరణ జరుగుతోందన్నారు. ఉద్యోగులకు ఎలాంటి సమస్యవచ్చినా పెవా అండగా వుంటుందనే విషయాన్ని ప్రతీ ఒక్క సభ్యుడూ గుర్తించుకోవాలన్నారు. ఉద్యోగులకు పనికొచ్చే సమాచారం, జీఓలను కూడా డైరీలో పొందుపరిచామన్నారు. ప్రముఖ వైద్యులు, కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డా. సిహెచ్.పాండురంగారావు మాట్లాడుతూ, ఒక మంచి లక్ష్యంతో పనిచేస్తున్న పెవాకు ఎలాంటి సహకారం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నానని భరోసా ఇచ్చారు. పద్మశాలీ ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, వైద్యులు, లాయర్లు, జర్నలిస్టులు ఇలా ప్రముఖ రంగాల్లో పనిచేస్తున్నవారు ఈ సంఘంలో సభ్యులుగా ఉండి పనిచేయడం అనేది చాలా గొప్పవిషయమన్నారు.
రిటైర్డ్ ఎంఈఓ, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాపర్తి సత్యనారాయణ, మాట్లాడుతూ, ఉద్యోగుల సేవ, సంక్షేమమే పరమావధిగా పెవా అందిస్తున్నసేవలు ప్రతీ పద్మశాలీ ఉద్యోగి వరకూ చేర్చేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. అదే సమయంలో వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులంతా అసోసియేషన్ లో చేరాలని పిలుపునిచ్చారు. ప్రముఖ కంటి వైద్య నిపుణులు హైమ నేత్రాలయం పసగడుగుల శివరాజ ప్రసాద్ మాట్లాడుతూ, పద్మశాలీ ఉద్యోగులకు, కులబాంధవులకు తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. అందరినీ ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు వీలుగా ప్రధాన రంగాల్లోని వారిని అసోసియేషన్ లో చేర్చి కార్యక్రమాలు చేపట్టడం అభినంద నీయమన్నారు. జిల్లాలోని అన్ని మండలాలకు పెవా సేవలు విస్తరించాలని ఆకాంక్షించారు. జిల్లా ఉపాధ్యక్షులు కోసూరు నాగ వెంకట సూర్యనారాయణ మాట్లాడుతూ, అన్ని ప్రభుత్వశాఖల్లోని పద్మశాలీ కులబాంధవులను గుర్తించి, వారిని సభ్యులుగా చేర్పిస్తున్నామన్నారు. దానికోసం ఇప్పటికే చేరిన సభ్యుల ద్వారా ప్రత్యేక క్యాంపైన్ కూడా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు జాగు చినబాబు, అంజూరి శ్రీనివాసరావు ప్రతినిధులు, సభ్యులు జిఎన్ఎస్.శిరీష, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ బ్యూరోచీఫ్ పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు), తదితరులు పాల్గొన్నారు.