అంగన్వాడీల సమ్మెకు టిడిపినేత ఆడారి కిషోర్ కుమార్ మద్దతు


Ens Balu
68
Visakhapatnam
2023-12-30 16:34:09

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీలు న్యాయమైన కోర్కెలను వెంటనే తీర్చాలని టిడిపి యువనాయకులు, మిషన్ కర్షకదేవోభవ జాతీయ అధ్యక్షులు ఆడారి కిషోర్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం జివిఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరవధిక ధర్నా చేస్తున్న అంగన్వాడీల ఆందోళనకు ఆయన సంపూర్ణ సంఘీబావాన్ని ప్రకటించారు. వారితో ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ, అంగన్వాడీలను ప్రభుత్వం వర్కర్లుగా కాకుండా ఎందరో పిల్లలకు సంరక్షణగా నిలిచే తల్లులుగా చూడాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీమేరకు డిమాండ్లు పరిష్కరించడం ద్వారా వీరంతా తిరిగి పిల్లలను సంరక్షించడానికి కేంద్రాలకు వెళ్లేందుకు అవకాశం వుంటుం దన్నారు. ప్రభుత్వం వీరి డిమాండ్ లను అంగీకరించేంతవరకూ చేసే పోరాటంలో తన మద్దతును తెలియజేస్తానని అన్నారు. కార్మిక చట్టాలను అనుసరించి గన్వాడీలకు జీతాలు పెంచాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్లు పెంచడంతోపాటు గ్రాడ్యుటీ కూడా అమలుచేయాలన్నారు.వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.19 రోజులుగా వీరుచేస్తున్న సమ్మెకారణంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని అంగన్వాడీ కేంద్రాలు అరకొరగానే నడుస్తున్నాయన్నారు. అంగన్వాడీలు కేంద్రాల్లో ఉంటే పిల్లలకు నాణ్యమైన ఆహారంతోపాటు, ఆటపాటలు ఆడించడానికి అవకాశం వుంటుందన్నారు. ప్రస్తుతం కేంద్రాలన్నీ బోసీ ఉన్నాయనే విషయాన్నిప్రభుత్వం పరిగణలోనికి తీసుకోవాలన్నారు. ఇన్నిరోజులుగా సమ్మె చేస్తున్నా కనీసం ప్రభుత్వం అంగన్వాడీల కోసం ఆలోచించకపోవడం శోచనీయమన్నారు. వీరి న్యాయపరమైన డిమాండ్ల సాధనకు అన్ని వర్గాలు మద్దతు పలకాలని ఆడారి కిశోర్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు రాజశేఖర్, శ్రీనివాసరావు, ఆడారికిషోర్ కుమార్ యువసేన ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకు ముందు అంగన్వాడీలు తమ డిమాండ్ల పత్రాన్ని ఆయనకు అందజేశారు.