సర్వశిక్షా అభియాన్ లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకూ ఉద్యమం ఆపేది లేదని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆడారి కిషోర్ కుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 21రోజులుగా తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న ఉద్యోగులకు మంగళవారం ఆయన సంఘీభావాన్ని తెలియ జేస్తూ..అనకాపల్లి హైవేపై బైటాయించి ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా విద్యాశాఖలో భాగంగా ఉన్న సర్వశిక్షా అభియాన్ లోన కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డెక్కి సమ్మె చేయాల్సి వస్తుందన్నారు. ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లాలో జడ్డు వాసుదేవరావు అనే ఉద్యోగి కూడా ప్రాణాలు వదిలారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి వారిని ఎంటిఎస్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సర్వశిక్ష ఉద్యోగులకు టిడిపి అండగావుంటుందన్నారు. ఈ క్రమంలో ఉద్యోగులందరూ హైవేపైన బైటాయించడంతో రంగంలోకి దిగిన రూరల్ పోలీసులు రోడ్డుపై ధర్నా చేస్తున్న ఉద్యోగులను చెదరగొట్టి ఆడారి కిషోర్ కుమార్ ను అరెస్టు చేశారు. తనను అరెస్టు చేసినప్పటికీ ఉద్యమం ఆపేది లేదని, ఉద్యోగులకు న్యాయం జరిగే వెనక్కి తగ్గేది లేదన్నారు. ఈకార్యక్రమంలో సర్వశిక్ష ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.