జనసేన - టీడీపి కూటమి ప్రభుత్వమే వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి రానున్నదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, పీఎసీ సభ్యులు కొణిదెల నాగబా బు అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి పార్టీ కార్యాలయంలో శనివారం జన సైనికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనకాపల్లిని పట్టి పీడిస్తున్నవి ప్రధానంగా దోమలు, వైఎస్సార్సీపీ నాయకులు పట్టి పీడిస్తున్నారన్నారు. సిగ్గు, యగ్గు వదిలేసి రోడ్ల పై గుండాల్లాగ వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేసారు అని ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. జన సైనికులకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం నేర్పారని, మీ దగ్గరకు ఓట్లు అడగడానికి వచ్చే వైఎస్సార్సీపీ నాయకులను ఈ ఐదేళ్ళలో ఏం అభివృద్ధి చేసారని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని అన్నారు. తిరుపతి వెంకన్న లడ్డూ ప్రసాదం తయారీలో అనకాపల్లి బెల్లం వాడేవారని దానిని కూడా వైఎస్సార్సీపి ప్రభుత్వం నిలిపివేసిందని అన్నారు. తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీను తిరిగి ప్రారంభించక పోగా అమ్మకానికి పూనుకున్నారని, ఫ్యాక్టరీ పై ఆధారపడిన లక్షలాది మంది రైతుల పొట్ట కొడుతున్నారని అన్నారు.
మీ అనకాపల్లి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పేరు నేను ఉచ్చరించడానికి కూడా ఇష్టపడటం లేదని, ఇలాంటి మంత్రిని నేను ఎక్కడా చూడలేదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రిగా ఉంటూ అనకాపల్లికి ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారు చెప్పాలని అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోని ఇంత నీచమైన, నికృష్టమైన, బఫూన్ ప్రభుత్వం లేదని ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దొరికిందని, ఒక్క అవకాశం అంటూ రాష్ట్రాన్ని దోచేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో గంజాయి వ్యాపారం ఎక్కువైపోయిందని ఉమ్మడి విశాఖ జిల్లా లోనే ఎక్కువ ఉత్పత్తి అవుతుందని రాష్ట్రమంతా అంటున్నారని అందులో ఇక్కడ మంత్రికి కూడా వాటా ఉందని తెలిసిందని అన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐరన్ హ్యాండ్ తో గంజాయి వ్యాపారాన్ని పెకిలిస్తామని అన్నారు. లా అండ్ ఆర్డర్ ను ఖచ్చితంగా అమలు చేస్తామని, ఆక్రమణలు, కబ్జాలు చేస్తున్న వారందరినీ అరెస్ట్ చేసి జరిమానా వేసి మరీ వసూలు చేస్తామని హెచ్చరించారు. జగన్ అద్భుతమైన నటుడు అని, పచ్చి అబద్ధాలు కొరు అని భూ ప్రపంచంలో అంతడి వాడు మరొకడు లేడని అన్నారు. ప్రతి ఒక్కరికీ విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యమని కొనియాడారు.
అంతకు ముందు అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జి, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి భాస్కరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో సైకో ముఖ్యమంత్రి ఎలాగో, ఇక్కడ కొడు గుడ్డు మంత్రి కూడా అలానే ఆక్రమణలు చేస్తున్నారని, విస్సన్నపేటలో 600 ఎకరాలు దోచుకుంటున్నారని అన్నారు. బీఆర్టి కాలనీలో 80 ఎకరాల ఢీ ఫారం భూములు అక్రమిస్తున్నారని, మండల పార్టీ ప్రెసిడెంటుల పేరుతో మైన్స్ లో దండుకుంటున్నారని, ఖాళీ స్థలం కనబడితే చాలు కబ్జా చేస్తున్నారని అన్నారు. మాకవరంలో ఐదు ఎకరాలు మంత్రి బంధువుల పేరిట క్వారీ ఏర్పాటు చేసుకున్నారని, జన సైనికులు పోరాడి క్వారీల్లో తప్పులను ఎత్తి చూపి ఇటీవల 8.16 కోట్లు జరిమానా కూడా వేయించారాని అన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 20 వేల ఇండస్ట్రీస్ ఉన్నాయని, పరిశ్రమల శాఖ మంత్రి మన జిల్లాలోనే ఉన్నప్పటికీ 100 మందికి కూడా ఉద్యోగాలు ఇప్పించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యారావు, ఉత్తరాంధ్ర జిల్లాల రాజకీయ వ్యవహారాల కమిటీ ఇంచార్జి సుందరపు వెంకట సతీష్, అర్బన్ ప్రెసిడెంట్ వంశీ కృష్ణ యాదవ్, రూరల్ జిల్లా ప్రెసిడెంట్ పంచకర్ల రమేష్ బాబు, కొట్ని సూరిబాబు, సత్యారావు గెంజి, జనసేన వీర మహిళలు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.