నిరాశ్రయులను రాత్రి బసలకు తరలించండి


Ens Balu
25
Visakhapatnam
2024-02-16 11:16:49

విశాఖ నగరంలో రోడ్లు, ఫుట్పాత్తులు, ఫ్లై ఓవర్లు, రోడ్ల సెంటర్ మీడియన్లలో నిద్రిస్తున్న నిరాశ్రయులను జివిఎంసి నిర్వహిస్తున్న నైట్ షెల్టర్లకు తరలించేలా చర్యలు చేపట్టాలని జివిఎంసి కమిషనర్ సిఎం.సాయికాంత్ వర్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ (యుసిడి) కె.వి.పాపునాయుడు ను ఆదేశించారు. శుక్రవారం జివిఎంసి ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో జివిఎంసి అదనపు కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ తో కలిసి నైట్ షెల్టర్ల నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.   ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో రాత్రిపూట నిరాశ్రయులు రోడ్లపైన, బహిరంగ ప్రదేశాలలో నిద్రించకుండా వారిని నైట్ షెల్టర్లకు తరలించే విధంగా చర్యలు చేపట్టాలని, అందుకు మూ డు బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

 

 రాత్రిపూట నిరాశ్రయులు ఎక్కడబడితే అక్కడ నిద్రించడం వలన పలు ప్రమాదాలు, ఇతర సంఘటనలకు గురి అయ్యే  అవకాశం ఉందన్నారు. రాత్రి బసకి తీసుకువచ్చిన నిరాశ్రయులను మరుసటి రోజు వారికి సంబంధించిన ప్రాంతాలకు వెళ్ళేలా వారికి సూచించేలా చర్యలు చేపట్టాలని నైట్ షెల్టర్ నిర్వాహకులకు తెలిపారు. పోలీస్ కేసులో ఉన్న మహిళా నిరాశ్రయులను నైట్ షెల్టర్లకు తరలించకుండా ప్రత్యేకంగా ఐసిడిసిఎస్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా బస కేంద్రాలకు తరలించాలన్నారు. రోడ్లపై తిరిగే వృద్ధులు, అనాధలు, మానసికంగా ఉన్నవారిని గుర్తించి నగరంలో సేవా దృక్పథంతో నిర్వహిస్తున్న పలు వృద్దాశ్రమలకు నిరాశ్రయ కేంద్రాలకు తరలించే ఏర్పాటు చేయాలని అదనపు కమీషనర్ కుప్రాజెక్ట్ డైరెక్టర్ కు కమీషనర్ సూచించారు.  ప్రతి నెల నైట్ షెల్టర్ నిర్వాహకులతో సమావేశాలు ఏర్పాటు చేస్తామని, అందరూ విధిగా సమావేశానికి హాజరు కావాలని కమిషనర్ ఆదేశించారు.

 

అనంతరం పలువురు నైట్ షెల్టర్ల నిర్వాహకులు, నగరంలో నిరాశ్రయుల సంఖ్య పెరుగుతున్నందున కొత్తగా మరిన్ని రాత్రి బసలు ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తి మేరకు కమిషనర్ స్పందిస్తూ, జివిఎంసి రెవెన్యూ విభాగంతో సమన్వయం చేసుకొని వారికి గాజువాక, అనకాపల్లి జోన్లలో నైట్ షెల్టర్లను ఏర్పాటుకు కేంద్రాలను గుర్తించాలని అదనపు కమిషనర్ కు, ప్రాజెక్ట్ డైరెక్టర్ కు సూచించారు. అలాగే నైట్ షెల్టర్ నిర్వాహకుల యొక్క గౌరవ వేతనాలను పెంచేందుకు చర్యలు చేపడతామని నిర్వాహకులకు కమిషనర్ తెలిపారు.

         జివిఎంసి అదనపు కమీషనర్ మాట్లాడుతూ నగరంలో ఎన్ని నైట్ షెల్టర్లు నిర్వహిస్తున్నారు, ఏ ఏ షెల్టర్లలో ఎంతమంది నిరాశ్రయులు  ఉన్నారు ? వారికి సమకూరుస్తున్న మౌలిక వసతులపై ఆరా తీసి, నిరాశ్రయులు ఏ ఒక్కరు రోడ్లపై నిద్రించకుండా రాత్రి బసలతో బస చేసే విధంగా చర్యలు చేపట్టాలని నిర్వాహకులను ఆదేశించారు.  ఈ సమావేశంలో భూపేష్ నగర్ నైట్ షెల్టర్ నిర్వాహకులు కొల్లి సింహాచలం, టిఎస్ఆర్ నైట్ షెల్టర్ నిర్వాహకులు ప్రగడ వాసు, ఇతర నైట్ షెల్టర్ నిర్వాహకులతోపాటు జివిఎంసి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్, పట్టణ ప్రణాళిక అధికారి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.