కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు నియోజవకర్గంలోని నాలుగు మండలాల పరిధిలోని వర్కింగ్ జర్నలిస్టుల ప్రధాన సమస్యలు పరిష్కరించాలని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ(అక్రిడేటెడ్) చీఫ్ రిపోర్టర్ పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) వైఎస్సార్సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త వరుపుల సుబ్బారావుని కోరారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆత్మీయ సమావేశంలో జర్నలిస్టులు, వారి సమస్యలపై కూలంకుషంగా చర్చించారు. ఈ సందర్భంగా ఈఎన్ఎస్ బాలు మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిబంధనల వలన ఈసారి మండల విలేఖరులకు ప్రెస్ అక్రిడిటేషన్ లు రాలేదని, నిబంధనలు సడలించి మండల కేంద్రంలో పనిచేసేవారికి అక్రిడిటేషన్లు వచ్చేలా చొరవ తీసుకోవాలని కోరారు. చాలా ఏళ్లు జర్నలిస్టులకు హౌస్ సైట్లు, హౌసింగ్ స్కీములు ఇస్తామన్న హామీలు కూడా నెరవేరలేదని, ప్రస్తుతం ఇంటి స్థలానికి దరఖాస్తు చేసుకోవాలంటే అక్రిడిటేషన్ అవసరమని దానికోసం జిల్లా కలెక్టర్ తో సంప్రదించి న్యాయం చేయాలని కోరారు. జర్నలిస్టులు ప్రతినిత్యం వార్త సేకరణ కోసం ద్విచక్రవాహనాలపై ప్రయాణిస్తుంటారని, అలాంటి వారందరికీ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ కూడా చేయించాలని కోరారు. అదేవిధంగా టోల్ గేట్ల వద్ద కూడా సున్నారాయితీ మీడియా వాహనాలకు వర్తింపచేయాలని కోరారు. అంతేకాకుండా ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు రాసే సమ యంలో పెట్టే కేసుల విషయంలో వాస్తవాలు గమనించాలని కోరారు. జర్నలిస్టుల సమస్యలపై ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ వరుపుల సానుకూలంగా స్పంది స్తూ.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం తన బాధ్యతగా స్వీకరిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో శంఖవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రౌతులపూడి మండలాల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేఖరులు పాల్గొన్నారు.