మహా విశాఖ నగరంలో గల ఇందిరా ప్రియదర్శిని స్టేడియంను అధునాతనంగా ఆధునీకరించి వినియోగంలోకి త్వరితగతిన తీసుకురావాలని జివిఎంసి కమీషనర్ సిఎం.సా యికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. గురువారం జివిఎంసి అధికారులతో కలసి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, ఇందిరా ప్రియదర్శిని స్టేడియం విశాఖ నగరంలో అతి పెద్దదని, ఈ స్టేడియం నందు అంతర్జాతీయ క్రీడలు జరిగి ఉన్నాయని, రానున్న రోజులలో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ క్రీడలు జరుగనున్నందున అందుకు సిద్దంగా ఈ స్టేడియంను మరింత అభివృద్ధి పరచి ఆధునీకరణతో తీర్చిదిద్ది వినియోగంలోనికి త్వరిత గతిన తీసుకురావాలని అధికారులకు సూచించారు. అనంతరం స్టేడియం లోపల జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి ఆడియన్స్ గేలరీ, విద్యుత్ స్తంబాలు, గ్రిల్ల్స్, స్కోర్ బోర్డు బిల్డింగ్, గార్డెనింగ్, పెయింటింగ్, లైటింగ్ మొదలగు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. ఆడియన్స్ ప్రధాన గేలరీకి ఆనుకొని వున్న హాల్స్, గదుల నందు ఇండోర్ గేమ్స్ ను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం స్టేడియం గేలరీల వెనుక భాగంలో గల ఖాళీ ప్రదేశాలలో టెన్నిస్, బాడ్మింటన్, వాలీ బాల్ తదితర క్రీడా సంబంధిత కోర్ట్ లను, పార్కింగ్ స్తలం, కెఫెటేరియా, ల్యాండ్ స్కేపింగ్, చిల్ద్రెన్ ప్లే ఏరియా, జిమ్ పరికరాలు మొదలగు వాటిని ఏర్పాటు చేయుటకు ప్రణాలిక లను సిద్దం చేసి సమర్పించాలని పర్యవేక్షక ఇంజనీర్ సత్యనారాయణ రాజును కమీషనర్ ఆదేశించారు.
స్టేడియం అంతటా పచ్చదనంతో ల్యాండ్ స్కేపింగ్, మినియేచర్స్, కూర్చునే బల్లలను ఏర్పాటు చేయాలని అసిస్టెంట్ డైరెక్టర్ అఫ్ హార్టికల్చర్ సురేష్ ను ఆదేశించారు. మార్చి నెల 15వ తేదీ నాటికి స్టేడియం నందు అన్ని పనులను పూర్తి చేసి అధునాతనంతో అందంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం దొండపర్తి నుండి నేషనల్ హైవే వరకు అక్కయ్యపాలెం రోడ్డు విస్తరణ, ఫుట్ పాత్ లు, కాలువలు, జంక్షన్ అభివృద్ధి, సెంటర్ మీడియన్, లైటింగ్, తదితర పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని పర్యవేక్షక ఇంజనీర్ వేణుగోపాల్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక ఇంజనీర్లు సంతోషి, మత్సరాజు, ఎ.సి.పి. ఝాన్సీలక్ష్మి, ఎ.ఎం.ఒ.హెచ్. రాజేష్ తదితరులు పాల్గొన్నారు.