పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యత - నగర మేయర్ గొలగాని


Ens Balu
8
Visakhapatnam
2024-02-22 11:49:30

 ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు జివిఎంసి పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. గురువారం ఆమె గాజువాక 87వ వార్డు పరిధిలోని అమరావతి, మదర్ థెరీసా, వాకర్స్, మహాత్మా గాంధీ పార్కులతోపాటు తిరుమల నగర్ చిల్డ్రన్ పార్కులను అభివృద్ధి పరిచేందుకు సుమారు రూ.50.70 లక్షల వ్యయంతో గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, వార్డు కార్పొరేటర్ బొండా జగన్నాథం, జోనల్ కమిషనర్ బంటు సన్యాసినాయుడు, గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త ఉరుకూటి చందు, వైయస్సార్సీపి వార్డ్ ఇంచార్జ్ శ్రీనులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర్ మేయర్ మాట్లాడు తూ ప్రతి వార్డులో ప్రజలకు ఆహ్లాదం కల్పించేందుకు పార్కులను జివిఎంసి అభివృద్ధి పరచడం జరుగుతుందని తెలిపారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో విశాఖ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. 87వ వార్డులో సుమారు 51 లక్షల రూపాయలతో తిరుమల నగర్, అమరావతి పార్కు, మదర్ థెరీసా పార్కు, వాకర్స్ పార్కు, మహాత్మా గాంధీ పార్కులను అభివృద్ధి తోపాటు సీసీ డ్రైన్లు, కల్వర్టుల నిర్మాణ పనులు చేపట్టేందుకు శంకుస్థాపన చేసామన్నారు. అనంతరం గాజువాక శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో విశాఖ నగరం ఎంతో అభివృద్ధి సాధించిందని, గాజువాక ప్రాంతానికి కోట్లాది రూపాయలు వెచ్చించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. రానున్న రోజుల్లో గాజువాక అభివృద్ధికి మరిన్ని నిధులు వెచ్చించి ప్రతి వార్డును ఒక మోడల్ వార్డుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి ఇంజనీరింగ్ అధికారులు, ఇతర వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.