మాడుగులలో బూడి కాకపోతే బూడిదే..!


Ens Balu
264
madugula
2024-03-30 19:40:54

అనకాపల్లి జిల్లాలో మొట్టమొదట గెలిచే సీటుగా వైఎస్సార్సీపీ మాడుగుల నియోజకవర్గంపై ఇపుడు నీలి నీడలు కమ్ముకున్నాయి. తొలుత డిప్యూటీ సీఎం బూడి ము త్యాల నాయుడుకి సీటు ఉంటే సునాయాసంగా గెలిచేవారని జిల్లా మొత్తం పెత్త ఎత్తున ప్రచారం జరిగింది. ఆ సీటు కాస్త ఇపుడు అధిష్టానం ఆయన కూతురు జెడ్పీ టీసీ అనూరాధకు  కేటాయించి, బూడిని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి పంపడంతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఏవిధమైన రాజకీయ అనుభవం లేని మహిళకు సీటు కేటాయిస్తే ఖచ్చితంగా సీటు కోల్పేయే ప్రమాదం ఉందని తెలిసి ఇపుడు కేడర్ మొత్తం మూగనోము పట్టారు. అంతేకాదు మాడుగులలో బూడి కాకపోతే సీటు బూడిదలో పోసిన పన్నీరేనని క్రింది స్థాయి నాయకత్వం మొత్తం పెదవి విరుస్తున్నారు. అందులోనూ, ఆమెకు నియోజకవర్గంలోని సర్పంచ్ లు, ఎంపీటిసీలు, జెడ్పీసీలతో పెద్దగా సత్సంబంధాలు లేవు. ఏదో మంత్రి కూతురు జెడ్పీటీసీ అంటే జెడ్పీటీగానే చూశారు తప్పితే మరో ఆలోచన ఆమెపై నేటి వరకూ క్యాడర్ కి లేదు. మళ్లీ ఆయన తనయుడు వెంకటేష్ తండ్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, నియోజకవర్గంతోపాటు జిల్లాల్లోనూ యువజన విభాగం, ఇతర అన్ని వర్గాల ప్రజలకు చాల దగ్గరగా ఉంటూ తండ్రి పదవికి, పార్టీకి మంచి పేరు తీసుకు వచ్చారు. ఒక దశలో సీటు వెంకటేష్ కే కేటాయించి, అనకాపల్లి ఎంపీ సీటుని తండ్రికి ఇస్తారని అంతా భావించారు. అంతలా పార్టీ కార్యక్రమాలు చేపడుతూ, క్యాడర్ కి కావాల్సిన పనులు చేయడంతో అందరికీ వెంకటేష్ తలలో నాలుకలా అయిపోయాడు. 

మంత్రి కొడుకు అనే కాకుండా.. పార్టీలో ఒక పేరున్న కార్యకర్తగా తన విధులు తాను నిర్వహించుకుంటూ పోతూ, అన్ని మండలాలు, గ్రామాల్లోనూ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేశారు. అయితే మహిళా సెంటిమెంటు, జిల్లా పార్టీ మహిళా అధ్యక్షురాలు కావడంతో వైఎస్సార్పీపీ అనూరాధకు సీటు కేటాయించింది. అయితే అప్పటి నుంచి క్యాడర్ మొత్తం కినుక వహిస్తున్నారని మాడుగుల మొత్తం మారు మ్రోగిపోతున్నది. ఈ దశలో మాడుగుల సీటు పోయినా పోయే అవకాశాలు ఉన్నాయని కూడా అంతా బల్లగుద్ది చెబుతున్నారు. జెడ్పీటీసీ మొహం మండలం కేంద్రంలో తప్పితే మరెక్కడా తెలియదని, అదే బూడి తనయుడు వెంకటేష్ అయితే యువతతోపాటు, నాయకులకు కూడా సుపరిచితం కావడంతో పార్టీ సీటు కేటాయించినా ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా క్యాడర్ మొత్తం మంత్రి బూడి వద్ద ప్రస్తావించారట. అయితే తాను నిమిత్త మాత్రుడనని..పార్టీ అధిష్టానం ఏం చెబితే అది చేయాలని చెప్పినా క్యాడర్ వినకపోవడంతో ఇపుడు బూడి కూడా అంతర్మధనంలో పడినట్టుగా చెబుతున్నారు.

 ఒక్క మాడుగుల సీటు మార్పు వలన ఇటు అసెంబ్లీ, అటు పార్లమెంటు కూడా దక్కే పరిస్థితి ఉందా అనే ప్రశ్నలు ఉద్బవిస్తున్నాయి. పార్ఠీ నిర్ణయం ఎలా ఉన్నా..కనీసం పరిశీలనలో ఉన్న వెంకటేష్ పేరుని తెరపైకి తీసుకురావడం ద్వారానైనా ప్రతిపక్షపార్టీలను ధీటుగా ఎదుర్కొని..తండ్రి  తరువాత తనయుడు ఉన్నాడని..ఉంటాడని..క్యాడర్ కూడా బలంగా నమ్ముతోంది. రసవత్తర రాజకీయం నడుమ వైఎస్సార్సీపీ మాడుగుల ఎమ్మెల్యే సీటు విషయంలో పునరాలోచించాలని కూడా క్యాడర్ మొత్తం డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే టిడిపి అభ్యర్ధి రామానాయుడికి సీటు కేటాయించాలని జరుగుతున్న రచ్చే ఇపుడు మళ్లీ వైఎస్సార్పీపీలో జరిగినా జరగొచ్చుననే వాదన కూడా తెరపైకి వస్తున్నది. ఈనేపథ్యంలో పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుంది..? మాడుగుల సీటుని తనయురాలికి కాకుండా తనయుడికి ఇచ్చి సీటు దక్కించుకుంటుందా..? లేదంటే బూడి లేకపోతే మిగిలే బూడిదతో సరిపెట్టుకుంటుందానే అనేది తేలాల్సి వుంది..!