అన్నవరంలో అపచారం..!


Ens Balu
18
annavaram
2024-07-04 08:08:11

అన్నవరం రత్నగిరి క్షేత్రంలో కొలువైన శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారే సాక్షత్తూ ఇక్కడి అధికారులు చేసిన తప్పులకు ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది.. అపచారం జరిగినా.. దానిని అధికారులు క్షణాల్లో మసిపూసి మారేడుకాయ చేసేసినా..ఏం తెలియని వాడిలా ఆ సత్యదేవుడు కూడా మౌనం వహించాల్సి వచ్చింది. కనీస జాగ్రత్తలు పాటించకుండా పురుగు మందులను విచక్షణా రహితంగా వెదజల్లే సమయంలో ఆ విషపూరిత వాసనకు తీవ్ర అస్శస్థకు గురైన వేద పాఠశాల విద్యార్దులు..చావు తప్పి కన్నులొట్టబోయి బ్రతికి బయటపడ్డారు. ఆ పురుగు మందుల వాసన మరింత కొద్దిసేపు వస్తే జరగకూడని దారుణం జరిగిపోయేది. అయినా..దానిని దేవస్థానం అధికారులు ఏకంగా డయేరియా సీజన్ కావడంతో వేద విద్యార్ధులు కలుషిత ఆహారం తిని డయోరియా భారిన పడ్డారని చెప్పేశారు. ఇదంతా యూట్యూబ్ వీడియోలు, అధికారులు, వైద్యులు, ఆపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారే స్వయంగా తిమ్మిని బమ్మిని చేసి చెబితే ఆ తేడా వీడియోలను కూడా సత్యదేవుడు ఖర్మ ఖర్మ..నా ఆలయంలో ఇంతటి ఘోరాలు జరగడమా..అంటూ కామ్ గా ఉండాల్సి వచ్చింది. 

 ఇంతకీ ఏం జరిగిందంటే.. బుధవారం వేదపాఠశాలకు కాస్త చేరువలో మొక్కలకు పురుగు మందులను సిబ్బంది, ఓ రిటైర్డ్ అధికారి ఆధ్వర్యంలో స్ర్పే చేయిస్తున్నారు. అలాంటి సందర్భంలో స్ర్పేయింగ్ చేసేవారితో పాటు, చుట్టుప్రక్కల ఎవరూ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ పక్కనే వేద పాఠశాల ఉన్నప్పటికీ ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా విచక్షణా రహితంగా స్ప్రేయింగ్ చేయడంతో వాటి వాసకు వేదపాఠశాలలో ఉన్న ఆరుగురు విద్యార్ధులు తీవ్రఅస్వస్థతకు గురయ్యారు. కానీ జరిగిన తప్పుని ఏకంగా ఇక్కడి అధికారులు, వైద్యులు, జిల్లా వైద్యాధికారితో సహా డయేరియా క్రింద చిత్రించేశారు. పోనీ డయేరియానే అనుకుంటే అంతటి తేడా పరిస్థితుల మధ్య 36 మందికి వేద పాఠశాల ఎలా నిర్వహిస్తారు..? ఎందుకు హానకరమైన ప్రదేశం ప్రక్కన ఉంచాల్సి వచ్చింది..? పురుగు మందుల అవశేషాలు ఆహారంపై న పడి వాటిని విద్యార్ధులు తింటే వారి పరిస్థితి ఏంటి అంటే మాత్రం ఆ ఒక్కటీ అడక్కు అంటున్నారు దేవస్థాన అధికారులు.

తమ పిల్లలు తీవ్ర అస్వస్థకు గురయ్యారని భయాందోళకు గురైన తల్లిదండ్రులకు దేవస్థాన అధికారుల నుంచి బెదిరింపులు వెళ్లినట్టు కూడా సమాచారం అందుతుంది. అక్కడ పురుగుమందుల స్ప్రేయింగ్ వలన కాకుండా డయేరియా వలనే విద్యార్ధులకు అస్వస్థకు గురయ్యారని చెప్పించినట్టు తెలిసింది. అలా చెప్పకపోతే వేద పాఠశాల నుంచి విద్యార్ధులను తొలగిస్తామని చెప్పడంతో ఆ భయంతోనే దేవస్థాన అధికారులు, వైద్య సిబ్బంది చెప్పమన్నట్టు విద్యార్ధుల తల్లిదండ్రులు కూడా చెప్పినట్టు తెలిసింది. అన్నవరం దేవస్థానంలో వేద పాఠశాలోని విద్యార్ధులకు అస్వస్థతకు గురయ్యారనే విషయంపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశిస్తే ఎక్కడ ఇబ్బందులు వస్తాయోనని ఏకంగా అన్నవరం కొండపై ఉన్న ఓ వర్గం మీడియాతో అధికారులు యూట్యూబ్ వీడియోల ద్వారా జరిగినదానికి భిన్నంగా వీడియోలు రిలీజ్ చేయడం కూడా పలు అనుమానాలకు తావిస్తున్నది. ఎన్ని అనుమానాలున్నా..వేద పాఠశాల వద్ద కెమికల్ స్ప్రెయింగ్, పురుగు మందుల డబ్బాలు స్ప్రేయింగ్ పై ఏ ఒక్క అధికారి మాట్లాకపోవడం విశేషం. పైగా విద్యార్ధులంతా బాగానే ఉన్నారు.. మీడియా మాత్రం ఇంత చిన్న విషయాన్ని రాద్దాంతం చేస్తుందని వైద్యాధికారుల దగ్గర నుంచి దేవస్థాన అధికారులంతా చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారని విద్యార్ధుల తల్లిదండ్రుల్లో కొందరు ఆరోపిస్తున్నారు. 

అలా అస్వస్థతకు గురైన సమయంలో జరగకూడదని ఏదైనా జరిగితే దానికి ఎవరు జవాబు దారీ అంటూ గొల్లుమంటున్నారు. ఆ భయంతోనే విద్యార్ధులు వైద్యం పొందుతున్న ఆసుపత్రివద్దకు వెళ్లిన వారికి సిబ్బంది ద్వారా బెదిరింపులు వచ్చినట్టు కొందరు బయటకి వచ్చి చెప్పడంతో విషయం కాస్త గుప్పుమంది. వైద్యాధికారులు, దేవస్థాన సిబ్బంది తప్పుచేసిన ప్రజాప్రతినిధికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాల్లో అధికారులు, వైద్యులు పై చేయి సాధించారు. కానీ ఇంత జరిగిన తరువాత డయేరియా అని ఏదైతే అధికారులు, వైద్యులు ప్రచారంలోకి అసలు విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారో దానిపై జిల్లా కలెక్టర్ విచారణ చేపడితే  కలుషిత ఆహారంపై అయినా అసలు విషయాలు వెలుగుచూసే అవకాశం వుంటుంది. అదే సమయంలో ఇలాంటి తేడా వ్యవహారాలు మరోసారి జరగకుండా ఉంటాయి. దేవస్థాన అధికారులు వేద పాఠశాల విద్యార్ధుల విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యహరించడం ఇది ఎన్నోసారో ఆ సత్యదేవుడికే తెలియాలి. ఇలాంటి అంశాల్లో జిల్లా కలెక్టర్ దృష్టి సారించకపోతే తీవ్ర అస్వస్థకు గురైన విద్యార్ధుల్లో ఏ ఒక్కరు మృతిచెందినా దానికి మొత్తం వైద్యులు, అధికారులు, జిల్లాను పరిపాలించే జిల్లా కలెక్టర్ సైతం సమాధానం చెప్పాల్సి వచ్చేది. సత్యదేవుకే కళ్ల మసి రాసి జరిగిన దాన్ని దాచిపెట్టిన తేడా అధికారులు, సిబ్బందిని వదలకూడదని తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్ధుల తల్లిదండ్రులు, భక్తులు ముక్త కంఠంతో కోరుతున్నారు.