పర్యాటకశాఖ ద్వారా చేనేత అద్దకం కళలకు ప్రాచుర్యం


Ens Balu
22
visakhapatnam
2024-08-07 15:43:57

చేనేత వస్త్రాలపై అద్దకం( హేండ్ మేడ్ ప్రింటింగ్) చేసే వస్త్రాలను ప్రోత్సహించేందుకు పర్యాటకశాఖ ద్వారా చర్యలు తీసుకుంటామని  జిల్లా పర్యాటకశాఖ అధికారిణి జ్ఞానవేణి పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విశాఖలోని శంభువానిపాలెంలోని హేండూలమ్ హేండ్ మేకింగ్ ప్రింటింగ్ కుటీర పరిశ్రమను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి అద్దకం కళాకారులతో ముచ్చటించారు. ఇక్కడ చేనేత వస్త్రాలు, ఇతర మోడల్స్ డ్రెస్సులపై ఎంతో చక్కగా ప్రింటింగ్(అద్దకం) వేస్తున్నారని ఆమె కితాబు నిచ్చారు. ఇక్కడ కళాకారులు పనితనాన్ని పర్యాటకశాఖ వెబ్ సైట్ ద్వారా ప్రాచుర్యం కల్పించడంతో పాటు వారికి పనికల్పించే విధంగా తమవంతు కృషి చేస్తామని.. అదేవిధంగా ఇక్కడి కళాకారులన వృత్తి నైపుణ్యాన్ని కూడా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హ‌రేంధిర ప్ర‌సాద్ దృష్టికి తీసుకు వెళ్లనున్నట్టు చెప్పారు. ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలతో పర్యాటశాఖలో వివిధ కార్యక్రమాలు, టూర్ ప్యాకేజీలు రూపకల్పన చేస్తున్నామని.. ఈ నేపథ్యంలోనే ఇక్కడి కళాకారుల నైపుణ్యం.. వస్త్రాలపై వేస్తున్న వివిధ రకాల ఆకృతుల ప్రింటింగ్ పైనా ప్రచారం కల్పించి ఇక్కడ కార్మికులను ఆర్ధికంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 

అంతేకాకుండా విశాఖ మహానగరంలోని బట్టల దుఖాణాలు, మగ్గం వర్క్స్ చేసే టైలరింగ్ షాపులు, ఇతర షాపింగ్ మాల్స్ కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ పనిచేస్తున్న చేనేత ముద్రిక కళాకారులకు చేయూత అందించి పని కల్పించాలని జిల్లా పర్యాటకశాఖ అధికారిణి జ్ఞానవేణి కోరారు. సుమారు పది కుటుంబాలకు చెందిన కళాకారులకు డిఎఫ్ఓ విశాఖలోని బయోడైవర్శిటీ పార్కులో  ప్రత్యేకించి వన సంపద కేంద్రాన్ని కూడా వీరికి కేటాయించి చేయూత అందిస్తున్నారని చెప్పారు. అన్నివర్గాల ప్రజలు అద్దకం కళాకారులకు చేయూత నివ్వడం ద్వారా ఈ కళను మరింతగా ప్రోత్సహించడానికి  అవకాశం వుంటుందని తద్వారా కళాకారులు ఆర్ధికంగా అభివృద్ధి చెందుతారని అన్నారు. ఈ పర్యటనలో జిల్లా పర్యాటకశాఖ అధికారిణితోపాటుగా ప్రమోటర్ గందం సునీత తదితరులు పాల్గొన్నారు.