విశాఖ జిల్లాలో లొకేషన్లు, సీ షోర్ ఏ స్థాయి సినిమాలకైనా అద్భుత వరమని సినీ నిర్మాత, ఉపకార్ చారిటబుల్ ట్రస్లు, ఏపిఎఫ్ఐఈఎఫ్ చైర్మన్ డా.కంచర్లఅచ్యుతరావు పేర్కొన్నారు. సినీపరిశ్రమ అభివృద్ధి చెందాలన్నా నిర్మాతలు స్థానిక కళాకారులు, కార్మికులకు పని కల్పించాలన్నారు. శనివారం విశాఖలో నటరత్న కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డా. కంచర్ల అచ్యుతరావు ఏపిఎఫ్ఐఈఎఫ్ చైర్మన్ ఏకగ్రీవంగా ఎంపికైన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. విశాఖలోని బీచ్ లు గోవా బీచ్ అందాలకు వందరెట్లు అందంగా ఉంటాయన్నారు. తమ సినిమాల్లో ఎక్కువగా విశాఖ అందాలను,సీ షోర్ ను చూపించే ప్రయత్నం చేశామన్నారు. ఇప్పటి వరకూ వైజాగ్ సిటీ ఆఫ్ డెస్టినీగా ఉందని..ఇకపై సినీ పరిశ్రమ అభివృద్ధి కూడా విశాఖ కేంద్ర బిందువు కావాలని, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి కీలకం కావాలని ఆకాంక్షించారు. సినిమాలు తీసే దర్శకులు, నిర్మాతలు స్థానిక కళాకారులు, టెక్నీషియన్లు, 24 క్రాఫ్ట్స్ సిబ్బందికి పని కల్పించడానికి ముందుకి రావాలన్నారు.
తద్వారా ప్రొడక్షన్ ఖర్చు తగ్గడంతోపాటు ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం వుంటుందన్నారు. సినీ కార్మికుల అభ్యున్నతి కోసం సరికొత్త ప్లానింగ్ తో ముందుకి వెళతామన్నారు. త్వరలోనే ఫెడరేషన్ లోని కార్మికులందరికీ ఈ-శ్రమ్ కార్డుల రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నామన్నారు. కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించేందుకు త్వరలోనే ప్రధాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లనున్నట్టు కంచర్ల ప్రకటించారు. ప్రక్క రాష్ట్రాలు, దేశాల్లో సినిమాలు తీయడం ఆదాయం మొత్తం సదరు ప్రాంతాలకు తరలి పోతుందనే విషయాన్ని నిర్మాతలు గమనంచాలన్నారు. విశాఖతోపాటు అరకు, రాజమండ్రి, కర్నూలు, తిరుపతి ప్రాంతాల్లో ఎన్నో సుందరమైన ప్రదేశాలు తెలుగు సినిమాలకు అనువైన ప్రాంతాలుగా ఉన్నాయని.. సినిమాల్లో అధిక భాగం స్థానికంగా తీయడం ద్వారా స్థానిక కళాకారులు, కార్మికులకు ఉపాది కలగడంతోపాటు సినిమా పరిశ్రమ వలన ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుందన్నారు.
అదేసమయంలో ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి కూడా ఆస్కారం వుంటుందని పేర్కొన్నారు. ఫిల్మ్ ఫెడరేషన్ కార్మికులకు పని కల్పించడంతోపాటు, ఇతర విభాగాల యూనిట్లు స్థానికంగా ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ద్వారా రావాల్సిన అనుమతులను తాను దగ్గరుండి తీసుకురావడానికి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతానని పేర్కొన్నారు. అనంతరం స్థానిక కళాకారులు, కార్మికులు డా.కంచర్ల అచ్యుతరావు ఫెడరేషన్ చైర్మన్ కావడంతోనే సినిమా పరిశ్రమ అభివృద్ధి ప్రారంభమైందని అభివర్ణించారు. అంతకు ముందు డా.కంచర్లను కళాకారులు, గాయకులు, ఫెడరేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉపకార్ ఛారిటబుల్ ట్రస్తు ప్రతినిధులు సుధీర్, నాగు, తదితరులు పాల్గొన్నారు.