జోరువానలో స్వయంగా ఎంపీ సీఎం రమేష్ లబ్దిదారులకు పించన్లు పంపిణీ చేశారు. ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రభుత్వం శనివారం చేపట్టింది. చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామంలో ఉదయం ఎన్టీఆర్ సామాజిక ఫించన్లు ఎంపీ పంపిణీ చేశారు. గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సామాజిక ఫించన్లు పంపిణీ చేయడం విశేషం. ముందుగా ఎమ్మెల్యే కే ఎస్ ఎం ఎస్ రాజు, ఎం.పి. రమేష్ గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో వెంకన్నపాలెం లోని ఫించను లబ్ధిదారులతో ఎం.పి. ముచ్చటించి, వారి ఆరోగ్య పరిస్థితులు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఆదేశాలతో మండలాల్లోని అన్ని గ్రామాల్లో తెల్లవారుజాము నుండే ఫించన్లు పంపిణీ ప్రారంభించారు. రాష్ట్రం మొత్తం మీద ఉదయం 10 గంటలకు మొత్తం 64,61,485 పింఛన్ లబ్దిదారులకు రూ.2,729.86 కోట్లు పంపిణీ చేసినట్లు ఎంపీ రమేష్ తెలిపారు. ఒకరోజు ముందుగానే పించన్లు పంపిణీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.