కళా, రాజకీయ రంగాల నిశ్వార్ధ సేవకుడు పవన్ కళ్యాణ్-డా. కంచర్ల


Ens Balu
55
visakhapatnam
2024-09-02 16:15:28

కళారంగానికి.. రాజకీయాల్లోనూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ అందించిన సేవలను వెలకట్టలేనివని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ గా ఉపకార్ ట్రస్టు, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత  సినీ నిర్మాత డా. కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. సోమవారం పవన్ కళ్యాన్ పుట్టినరోజు సందర్భంగా  పవన్ కళ్యాణ్ కళాపీఠంను లోగోను ఆయన పౌరగ్రంథాలయంలో జనసేన నాయకులు కందుల నాగరాజు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డా కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, సినీ రంగంలోనే ఆయన నటులకు, కళాకారులకు ఒక మాస్టర్ అని.. రాజకీయ రంగంలో నిశ్వార్ధ సేవకుడని కొనియాడారు. సేవే లక్ష్యంగా.. ప్రజా పరిపాలనే ధ్యేయంగా ఆయన ప్రభుత్వంలో తీసుకువస్తున్న సంస్కరణలు ఎందరికో ఆదర్శమని కొనియాడారు. ప్రజా సమస్యలపై ఆయన ఎన్నో ఏళ్లుగా  అలుపెరగని పోరాటం చేస్తున్నారని.. ప్రజా సమస్యల పరిష్కారంపై తక్షణమే  స్పందించి చర్యలు తీసుకోవడంలో ఆయనకు ఎవరూ సాటిరానని ప్రశంసించారు. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వంలో ఆయన అత్యంత  కీలకపాత్ర పోషించడం గర్వించదగ్గ విషయమన్నారు. 

రాజకీయాల్లో ఛాలెంజ్ చేసి మరీ రాణించిన వ్యక్తి  ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమేనని అన్నారు.  గౌరవ అతిధులుగా హాజరైన కందుల నాగరాజు, గంట్ల శ్రీనుబాబులు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి కళాపరిషత్ ఏర్పాటు కావడం, ఆ సంస్థ పలు సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందించదగ్గ విషయమన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కళాపీఠం ఏర్పాటు కావడం అభినందనీయమన్నారు. ఈ సంస్థ భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్నననలు పొందాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ సినీ రాజకీయ రంగాల్లో తనకంటూ ప్రత్యేకంగా చెరగని ముద్ర వేసుకున్నారని  కొనియాడారు. ఈ సంస్థ గౌరవ అధ్యక్షులు గెంబలి జగదీష్, అధ్యక్షులు మెరుపు వరప్రసాద్, కార్యదర్శి పీలా హరిప్రసాద్, గంటి మురళీధర్, సినీనటుడు రవితేజ, కొరియోగ్రాఫర్ ఆర్.నాగరాజుపట్నాయక్, కన్వీనర్ కె.ఇందిరా ప్రియదర్శిని తదితరులు పవన్ కళ్యాణ్ కళాపీఠం ఆవిర్భావంలో తమ వాణిని వినిపించారు. అనంతరం అతిధులను గెంబలి జగదీష్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అంతకు ముందు నిర్వహించిన మెగా సంగీత విభావరి అలరించింది. ఈకార్యక్రమంలో పెద్ద ఎత్తున పవన్ కళ్యాన్ అభిమానులు, జనసేన నాయకులు, ఉపకార్ ట్రస్టు సభ్యులు, ఫెడరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.