మా ఊరి రోడ్డు పరిస్థితి ఇలా ఉంది కలెక్టర్ సారూ.. మా ఊరి పేరు కొనపురం.. మండలం అనంతగిరి.. మన అల్లూరి సీతారాజు జిల్లాయే.. మా గ్రామంలోకి మీరు ఒక్కసారి వచ్చారంటే ఇక్కడి రోడ్డు పరిస్థితి ఏంటో మీకు అర్ధమైపోతుంది. మేము దరఖాస్తులు పెట్టినంత కాలం ఏదో మామూలు రోడ్డు సమస్య అనుకుంటున్నారు జిల్లా అధికారులంతా. అందుకనే మా గిరిజన తండా రోడ్డు కోసం మేము చెప్పేకంటే మీరొచ్చి ఒక్కసారి చూసినా.. కనీసం ఈ గూండా ప్రయాణం చేసినా మొత్తం సమస్య మీకు అర్ధమైపోతుంది. ఇంకో మాటసారూ.. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు బాగా మారు మూల గ్రామాలకు వాడేశామని చెబుతున్నారు అధికారులు.. వాళ్లకి.. సబ్ ప్లాన్ నిధుల ప్రచారానికి ఈ రోడ్డుని ఫోటోలు పెట్టి చూపిస్తే రోడ్లు ఎంతబాగా వేశారో మీకు, ప్రజలకి అటు ప్రభుత్వానికి కూడా చాల చక్కగా తెలుస్తుందండయ్యా.. ఇలా అన్నామనీ మాపై కోపం పెంచుకోకండి. మా గ్రామానికున్న ఒకే ఒక్క రహదారి పూర్తిగా పాడైపోయి రాళ్లు తేలితే మేము పడుతున్న బాధలు మీకు చెప్పాలని మాత్రమే ఈ పద ప్రయోగం తప్పా మరేమీ లేదండయ్యా..!
అనంతగిరి మండలం కొనపురం గ్రామానికి వెళ్లాలంటే ఈరోడ్డుపై ఒక్కసారి అధికారులుగానీ, ప్రజా ప్రతినిధులు గానీ ప్రయాణం చేస్తే ఇక్కడి ప్రజలు నిత్యం పడుతున్న బాధలేంటో తెలుస్తాయని వాపోతున్నారు గ్రామస్తులు. గత ప్రభుత్వంలో ఐటిడిఏకి కొనపురం గ్రామం రోడ్డు సమస్యను విన్నవిస్తే రోడ్డుు సాంక్షన్ అయ్యిందిగానీ.. నిధులు లేవని చేతులెత్తేశారట. ఇపుడేమో కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత ఫిర్యాదు చేస్తే సాంక్షన్ అయిన పాత రోడ్డు పోయింది.. మళ్లీ కొత్తగా కంప్లైయింట్ పెట్టమంటున్నారని గ్రామస్తు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామసభలో తీర్మానించి మరీ సమస్యను ఐటిడిఏ అధికారుల దృష్టికి తీసుకెళితే చూద్దాం.. చేద్దాంలే అని ఊరకుండిపోతున్నారని వాపోతున్నారు. అసలు రోడ్డు వేసే సమయంలోనే నాణ్యతగా వేస్తే మాకు ఈరోజు ఈ పాట్లు వచ్చేవి కాదు కదాని ప్రశ్నిస్తున్నారు కొనపురం గ్రామస్తులు.
ఈ గ్రామం నుంచి పిల్లలకు పక్క గ్రామానికి బడికిపోవాలన్నా.. సంతలకు వెళ్లాన్నా.. ఎవరికైనా ఒంట్లో బాగోలేకపోతే మండల కేంద్రానికి వెళ్లాలన్నా ఈ గుంతలు పడిన రాళ్లు తేలిపోయిన రోడ్డుపై నుంచే ప్రయాణం చేయాల్సి వస్తున్నది. గర్భిణీ స్త్రీలను ఈరోడ్డు మార్గంలో ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో మార్గ మధ్యలోనే కాన్పులు అయిపోతున్నాయని కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ రోడ్డు బొర్రా గుహలకు, లోతేరు జంక్షన్ కు పది కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. ఈ ప్రాంతానికి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నా.. ఆదాయం ఆర్జించే ప్రభుత్వం.. రోడ్డు మార్గాన్ని బాగుచేసే ప్రయత్నం చేయడం లేదని అంటున్నారు. కనీసం గుంతలు కప్పినా రాకపోకలకు అంతరాయం లేకుండా ఉంటుందని.. కనీసం ఆ సమస్యనైనా తీర్చాలని కొనపురం గ్రాస్తులు ముక్త కంఠంతో కోరుతున్నారు.