సమాజాన్ని తీర్చిదిద్దటంలో ఫోర్త్ ఎస్టేట్ పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్, ఉపకార చార్టిబుల్ ట్రస్ట్ అధినేత, సినీ నిర్మాత డా. కంచర్ల అచ్యుతరావు అన్నారు. మంగళవారం విశాఖ పౌరగ్రంధాలయంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనుబంధ సంస్థ ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ , ఉపకార్ చార్టిబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో విశేష సేవలు అందిస్తున్న జర్నలిస్టులను , వీడియో జర్నలిస్టులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కంచర్ల అచ్యుత రావు మాట్లాడుతూ ప్రజలకు నిర్భయంగా నిజాలు తెలియ చేసే మీడియా అంటే ఎంతగానో అభిమానిస్తానన్నారు. జర్నలిస్టులకు ఎల్లవేళలా తాను అండగా ఉంటానని తెలిపారు. త్వరలో విడుదలకు సిద్దమవుతున్న కంచర్ల సినిమా విడుదల రోజున జర్నలిస్టుల సంక్షేమానికి పదిలక్షల రూపాయలు అందచేస్తానని జర్నలిస్టుల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు.
జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఎయిర్పోర్ట్ సలహాసంఘం సభ్యుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టులకు అన్నివిధాలా అండగా నిలిచే కంచర్ల చేపడుతున్న సేవా కార్యక్రమాలకు మీడియా విస్తృతంగా ప్రాచుర్యం కల్పించాలని కోరారు. దాదాపు మూడు దశాబ్దాలుగా మీడియాలో సేవలందిస్తున్న తాను జర్నలిస్టులకు పలు విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు.రాష్ట్రంలో ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో ముందుంటుందన్నారు. ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షుడు పీ నారాయణ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నామని త్వరలో సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి ని కలిసి ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కోరనున్నట్లు తెలిపారు.
అనంతరం విశాఖ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో విశేష సేవలు అందిస్తున్న రామకృష్ణ రావు, అక్కెన నరేష్, జార్జ్ ఫెర్నాండేస్, అప్పల రాజు, గజం విజయ్, ఎమ్మెస్సార్ ప్రసాద్ , కిలాపర్తి పీటర్ ప్రదీప్ , భాస్కర్ శంకర రావు, సురేష్, కేవీ అప్పారావు, సారిక అప్పల స్వామి, సిరికి నూకనాయుడులను ముఖ్య అతిధి కంచర్ల అచ్యుత రావు, గంట్ల శ్రీనుబాబు, నారాయణ పూలమాలలతో, శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. అతిధులను బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈరోతి ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కింతాడ మదన్ లు గజమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతల కుటుంబ సభ్యులు, బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ కమిటీ సభ్యులు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏపీబీజేఏ ప్రతినిధులు నాయుడు, నర్సిం గరావు, సురేష్, శేషు మళ్ళ దేవత్రినాధ్, దిలీప్, డి రవి కుమార్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.