రాష్ట్రం లోని వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు రెగ్యులర్ చేసే విషయాన్ని ప్రభుత్వం క్యాబినెట్ లో చర్చించి తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సస్ స్ట్రగల్ కమిటీ ప్రతినిధులు ప్రభుత్వాని డిమాండ్ చేశారు. సదరు సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసనలు మంగళవారంతో 12వ రోజుకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా కాంట్రాక్టు స్టాఫ్ నర్సు లు మాట్లాడుతూ, జీఓనెంబరు 115 ద్వారా ప్రభుత్వం తమకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సదరు జీఓను రద్దుచేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 11500 మంది కాంట్రాక్టు స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలన్నారు. ప్రభుత్వంలో ప్రధాన అంశాల పై నిర్ణయాలు తీసుకునే ఏపీ కేబీనెట్ లో ఈ అంశాన్ని చేర్చాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో గతంలో ఎ.ఎన్.ఎం లకు జీఓఎంఎస్ నెం-5, జీఓఎంఎస్ నెం- 57 ల ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో ట్రైనింగ్ ఇచ్చి జిఓఎంఎస్ నెం-115 తో ఏఎన్ఎం లకు స్టాఫ్ నర్సులు(జిఎన్ఎం) గా పదోన్నతి ఇస్తుందన్నారు.
ఇలా ఇచ్చే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 11500 మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను కనీసం పరిగనణలోనికి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఆసుపత్రుల్లో సేవలు అందిస్తున్నా ప్రభుత్వం తమను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తమ కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల్లో జీఎన్ఎం, బిఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్శింగ్ చదివి ఇప్పటికే 15 ఏళ్లుగా సేవలు అందిస్తున్నామన్నారు. ఇందులో చాలా మంది మంది ఐదేళ్లు దాటిన వారు, మరికొందరు మూడేళ్లు దాటిన వాళ్లు ఉన్నారని. అయితే వాళ్లని ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోకుంగా కేవలం ఏఎన్ఎంలను మాత్రమే ప్రమోషన్ ఇచ్చి స్టాఫ్ నర్సులుగా చేయడం ఎంత వరకూ సబబని ప్రశ్నించారు. 13 ఏళ్లుగా ఎటువంటి రెగ్యులర్ నోటిఫికేషన్ రాలేదని..కనీసం వేల సంఖ్యలో ఉద్యోగ విరమణలు చేస్తున్న స్టాఫ్ నర్సుల ఖాళీల్లో కాంట్రాక్టు స్టాఫ్ నర్సులతోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.