మహా విశాఖలో ‘అపర రక్త దాన’ కిరణుడు..!


Ens Balu
214
visakhapatnam
2024-09-28 13:39:29

ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటే దేవుడంటారు.. ఈ లెక్కన ఆ జర్నలిస్టు ఎన్నిసార్లు దేవుడవ్వాలి..మరెన్నిసార్లు మంచోడవ్వాలి.. అంటే ఇప్పటి వరకూ ఆ జర్నలిస్టు 74 సార్లు దేవుడు.. 7 సార్లు ఆపద్భాంధవుడు అయ్యాడు.. ఇంతకీ అన్ని సార్లు దేవుడవడానికి కారణం మాత్రం ఒక్కటే.. అదే రక్తదానం.  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 74 సార్లు రక్తం దానం చేసిన అపర రక్తదాన కర్ణుడు..అతనే జర్నలిస్టు కాళ్ల సూర్యప్రకాష్(కిరణ్). విశాఖలో వర్కింగ్ జర్నలిస్టుగా పనిచేస్తూ.. సామాజిక బాధ్యతగా ఏడాదికి నాలుగు సార్లు రక్తం దానం చేస్తూ ఎందరికో ఆపద సమయంలో అండగా నిలిచాడు.. నిలుస్తున్నాడు కూడా. ఒక్క రక్తం దానమే కాదు. ఎవరికైనా కష్టం వచ్చిందని తెలిసినా వెంటనే నేనున్నాంటూ ముందుకెళ్లిపోతాడు. తనకు తోచిన రీతిలో అభాగ్యులకు అన్నదానం కూడా చేస్తుంటాడు. జర్నలిస్టులకు ఏ అవసరం వచ్చినా.. తన పని ఉందని తెలిసినా.. ఎవరైనా తనను గుర్తించి పని పురమాయించినా నిండు మనసుతో ఆ పనులు చక్కబెట్టి అందరివాడిగా మారిపోయాడు.

ఐదు రూపాయలు సహాయం చేసి రూ.500 పైగా పబ్లిసిటీ చేయించుకుంటున్న ఈ రోజుల్లో జర్నలిస్ట్ కిరణ్ చేసే రక్తదానం ఆయనకి..దానం తీసుకున్న వారికి తప్పా మరెవరికీ తెలియదు.. ఇపుడు మాత్రం ఈరోజు-ఈఎన్ఎస్ ద్వారా బాహ్య ప్రపంచానికి కూడా తెలియజేసే అవసరం వచ్చింది. చెడ్డవారికోసం లోకానికి తెలియడం ఎంత అవసరమో.. అదేవిధగా మంచి వారి కోసం కూడా అంతకంటే ఎక్కువగా బాహ్య ప్రపంచానికి తెలియజేయడం చాలా అవసరం. అలా చేయడం వలన జర్నలిస్ట్ కిరణ్ లాంటి వారిని స్పూర్తిగా తీసుకొని మరింత మంది రక్తదానం చేయడానికి ముందుకి వచ్చే అవకావం వుంటుంది. మీడియా అంటే సమాజంలో జరిగే అన్ని విషయాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత వుంటుంది. ఒకరకంగా అదికూడా ప్రజాసేవే. ఎందరికో ఆపద సమయంలో రక్తం చేసే కిరణ్ కోసం కొందరికే ఈ విషయం తెలిస్తే.. ఈయన దగ్గర రక్తం దానం తీసుకున్నవారు.. ఈయనకోసం తెలుసుకున్నవారు.. తెలియనివారి కోసం తెలియజేసిన వారమవుతామని ఈ విషయాన్ని ప్రత్యేక కథనంగా మీ ముందుకి తీసుకువస్తున్నాం. 

డబ్బు దానం చేస్తే అది ఖర్చు అయిపోతే మరిచిపోతారు.. అన్నం దానం చేస్తే అది అరిగిపోతే ఆకలి తీరుతుంది.. కానీ రక్తం దానం చేస్తే మాత్రం ఒక నిండు ప్రాణం నిలబడుతుంది. అందుకోసమే తాను ఈ సేవను ఎంచుకున్నానని చెబుతాడు కిరణ్. ఒక్కోసారి చాలా మంది రక్తం దానం చేసినందుకు డబ్బులిచ్చే ప్రయత్నం చేస్తారని.. కానీ అలా చేయడం తనకి ఇష్టం లేకనే చేసిన దానాన్ని కూడా తెలియకుండా ఉంచుతానని చెబుతాడు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మాత్రం రక్తం దానం చేసినపుడుల్లా ఫోటోలు పెడుతున్నానని.. అదీకూడా పబ్లిసిటీ కోసం కాదని.. ఎపుడైనా ఎవరికైనా రక్తం కావాల్సి వస్తే.. వెంటనే తనను సంప్రదిస్తారనే సామాజిక కారణంతోనే పెడుతున్నానని చెబున్నాడ జర్నలిస్టు కిరణ్. ఎన్నోసార్లు ఎన్నో వార్తలు రాసిన తాను. రక్తం కోసం.. అత్యవసర సమయంలో దాని విలువ తెలిసిన వాడిని కనుకే అర్ధరాత్రి లేపి రక్తం కావాలని వచ్చినా నిశ్శంకోచంగా దానం చేస్తానని ఈఎన్ఎస్-ఈరోజుకి  చెప్పుకొచ్చాడు.  

-రక్తం దానం చేయండి ప్రాణదాతలు కండి
అత్యవసర సమయంలో మీరు చిందించిన రక్తపు బొట్టు ఒక నిండు ప్రాణాన్ని బ్రతికిస్తుంది.. ఈరోజుల్లో అవసరానికి రక్తం దొరక్క ఎందరో మృత్యువాత పడుతున్నారు. అలాంటివారిని ఆదుకోవాలంటే మంచి మనసునున్నవారంతా రక్తం దానం చేయడానికి ముందుకి రావాలి. రక్తం దానం చేయడం వలన ఆరోగ్యం పెరుగుతుంది. అయితే శరీరంలోని 12 గ్రాములకు మించి రక్తం ఉన్న వారు ఏడాదికి నాలుగు సార్లు రక్తం దానం చేయవచ్చు. అలా రక్తం దానం చేయడం ద్వారా దానిని విభజించి ప్లేట్ లెట్స్ గా కూడా రోగులకు ఎక్కిస్తున్నారు. రక్తం దానం చేసి ప్రాణ దాతలు కండి. రక్తం దానం చేసిన తరువాత మళ్లీ శరీరంలో రక్తం పెరగడానికి క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ తోపాటు, బలవర్ధక ఆహారం తీసుకుంటే అతి తక్కువ సమయంలోనే దానం చేసిన రక్తం మళ్లీ శరీరంలోకి చేరుతుంది. ఇప్పటికీ ఒక్కవిశాఖలో రోజుకి 50 యూనిట్లు రక్తం ఆసుపత్రులకి అవసరమే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి.