జల కళలో వీరుడు.. జలాసనంలో ధీరుడు..!


Ens Balu
111
gurla
2024-10-13 09:28:30

 "సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా" అన్నాడో సినీ కవి.. ఆయన మాటలు పాటకు బాగున్నా.. పాటలోని భావాన్ని మాత్రం ఆచరణలో చూపిస్తున్నాడీయువకుడు. ఎవరివద్ద ఎటువంటి శిక్షణ పొందకుండానే స్వీయసాధనతో జల కళలో పట్టు సాధించి.. జలాసనంలో అబ్బురపరుస్తున్నాడు. నీటిలో వెల్లకిలా నాలుగు గంటలపాటు తేలియాడుతూ ఔరా..! అనిపిస్తున్నాడు. అతనే విజయనగరం జిల్లా గుర్ల మండ లం గూడెం గ్రామానికి చెందిన శనపతి సంతోష్. జలాసనంలో తనదైన శైలిలో ప్రతిభ కరబరుస్తున్నాడు. సంతోష్ జలాననానికి ముగ్దు లవుతున్నారు. చూపరులు. ప్రస్తుతం ఈయన టాలెంట్ జిల్లానే కాదు రాష్ట్రం దాటి  దేశం మొత్తం చక్కర్లు కొడుతున్నది. 

 పుట్టుకతో వికలాంగుడైన సంతోష్ కు చిన్నప్పటి నుంచి ఈత అంటే మహా సరదా. ఊర్లో చెరువులు, బావుల్లో స్నేహితులతో కలిసి గంటలకొద్దీ ఈత కొట్టేవాడు. క్రమంగా జలాసనం గురించి తెలుసుకున్న సంతోష్ దానిపై ఆసక్తి పెంచుకున్నాడు. పాటించాల్సిన మెళకువలపై కూడా ఎవరినీ సంప్రదించకుండా తనకుతానుగానే బావుల్లో జలాసనం వేయడం మొదలుపెట్టాడు. ఐదు నిమిషాలతో మొదలైన జలాసనం ఇప్పుడు ఏకబిగిన నాలుగు గంటలు  క్షణకాలం కూడా విరామం ఇవ్వకుండా,  నిరంతరాయంగా కొనసాగించే స్థాయికి చేరుకునే ప్రావీణ్యం సంపాదిం చాడు. ఈయ జన కళా ప్రావీణ్యం చూసిన వారు ఎవరైనా  ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతటి పట్టు ఎలా సాధ్యమైందని అడిగితే, చిరునవ్వే సమా ధానమవుతుంది. నాలో అసక్తే నాతో ఇలా జలక్రీడకు ఊతమిచ్చే జలాసనం చేయిస్తోందని చెబుతుంటాడు. 

 జలాసనానికి ముందుగా కొన్ని నిమిషాల పాటు ఈతకొట్టి, ఆ తర్వాత ఊపిరి బిగబట్టి నీటిలో వెల్లకిలా తేలియాడి జలాసనానికి ఉపక్రమించాక, తిరిగి విరమించేవరకు అచేతనంగా అలాగే ఉంటాడు. ఏ ఒక్క ఆవయవం లోనూ చలనం కనిపించదు. ఆ స్థితిలో చూసేవారెవరైనా మృతదేహంగా భావించి భయపడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి..! అంతేకాదు.. ఈ జల క్రీడా నేర్చుకునే సమయంలో ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందిన ఉదంతాలూ ఉన్నాయి. రహదారి అంచునున్న బావిలో సంతోష్ జలాసనంలో ఉన్న సమయంలో, ఆ రహదారి మీదుగా రాకపోకలు సాగించేవారు బావిలో మృతదేహం ఉందంటూ కేకలు పెట్టిన సందర్భాలు కోకొల్లలు. తీరా అసలు విషయం తెలిసాక నోళ్లు వెళ్ళబెట్టకునేవారు అంతా.  ఈ కళను హాబీగా చేసుకున్న సంతోష్, చూపరుల కోరిక మేరకు తరచూ ప్రదర్శిస్తూనే ఉంటాడు.  

మారుమూల గ్రామంలో పుట్టి, అందునా వికలాంగుడు ఎవరివద్ద తర్ఫీదు లేకుండా స్వీయసాధనతో ఇంతటి ఘనతను పొందడం నిజంగా ఆశ్చర్యకరమే! ఇప్పటికే సామాజిక మాధ్యమాల ద్వారా ఎనలేని గుర్తింపు పొందిన సంతోష్ నాలుగు గంటల తన రికార్డును తానే తిరగరాసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ సమయం ఐదు గంటలా.. ఇంకా ఎక్కువా అనేది మాత్రం ఇప్పుడప్పుడే తెలీదు. కానీ నిత్యం జలాసనంలో సమయాన్ని పెంచుకుంటూ.. కఠోర సాధన చేస్తున్నాడు సంతోష్.  శిక్షణ ద్వారా జలాసనంలో ప్రావీణ్యం సంపాదించినవారందరికీ తాను ఏకలవ్య శిష్యుడినని వినమ్రంగా చెప్పే సంతోష్, ఈ కళలో మరింతగా రాణించాలని కోరుతున్నారు గూడెం గ్రామస్తులు. ఇలాంటి జల క్రీడ, జలాసనంలో నైపుణ్యం ఉన్నవారిని ప్రభుత్వం గుర్తించి ఆర్దికంగా చేయూ అందిస్తే మరిన్ని రికార్డులు నమోదు చేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. జలాసన వీరుడికి అందరూ అభినందలు చెప్పాల్సిందే..!

-జలాసనం నేర్చుకునే ఆశక్తి ఉంటే 
జలాసనం నేర్చుకోవడంలో నేనే స్వయంగా నేర్చుకున్నాను. ఈత కొట్టడం అందరికీ వస్తుంది. అలాకాకుండా అంతకు మించి నేర్చుకోవాలని అనుకున్నప్పుడు ఈ జలాసనంపై ఆశక్తి ఏర్పడింది. దీనితో స్వయంగా సాధన చేస్తూ ఈ జలాసనం వేయడం నేర్చుకున్నాను జలాసనం నేర్చుకునే ఆవక్తి ఉన్నవారికి ఈ ఆసనం వేయడం నేర్పిస్తాను. అయిదే దానికి ముందుగా వారికి ఈత కొట్టడం వచ్చి ఉండాలి. తద్వారా ఈ జలాసనం నేర్చుకోవడం సులవవుతుంది. ఇలాంటి ఆసనాలు వేసే సమయంలో నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే వేయాలని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది కదలకుండా ఉండే నీటిలో.. అంటే నేల భావులు, స్విమ్మింగ్ ఫూల్స్ లో మాత్రమే వేయడానికి వీలుపడుతుంది. ఈ ఆసనం నేర్చుకోవడం ద్వారా వాయుబంధనం కూడా అలవాటు అవుతుంది. ఎవరికైనా నేర్చుకోవాలని అనిపిస్తే నేరుగా నన్ను సంప్రదించవచ్చు అంటున్నారు సంతోష్.