కలెక్టర్ ఆదేశాలు వైరల్.. యలమంచిలిలో మీడియా వెర్సస్ సోషల్ మీడియా


Ens Balu
93
yalamanchili
2024-11-01 19:02:44

అనకాపల్లి జిల్లాలో మీడియాకి సోషల్ మీడియాకి యుద్దం మొదలైంది.. ప్రభుత్వ కార్యక్రమాల్లో మీడియాకంటే సోషల్ మీడియా తెగ హడావిడీ చేస్తూ.. మీడియా రంగానికి చెందినవారు కాకుండా బయట వ్యక్తుల హల్ చేస్తున్నారంటూ యలమంచిలి జర్నలిస్టులు తమ గోడుని జిల్లా కలెక్టర్ కి విన్నవించుకున్నారు. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్.. అధికారిక కార్యక్రమాల్లో అక్రిడేటెడ్ జర్నలిస్టులకే ప్రాధాన్యత ఇవ్వాలంటూ తహశీల్దార్ ను ఆదేశించారు. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అవుతుంది..! 

ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో హడావిడి చేస్తున్న సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లను నియంత్రించాలంటూ యలమంచిలిలోని అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్టులు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయక్రిష్ణణ్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. దానితో స్పందించిన కలెక్టర్  తహశీల్దార్ కి జిల్లా సమాచారశాఖ పౌర సంబంధాలశాఖ అధికారి ద్వారా వర్తమానం పంపారు. ప్రస్తుతం ఈ లేఖ రాష్ట్రంలో బాగా వైరల్ అవుతుంది. యలమంచిలిలో యూట్యూబ్ ఛానల్స్ అధికం అవడం, ప్రతీ ప్రభుత్వ, అధికారిక కార్యక్రమాలకి మీడియా కంటే ఐదు రెట్ల మంది యూట్యూబ్ ఛానల్స్ రావడంతో చేసేది లేక అక్రిడేటెడ్ జర్నలిస్టులు సోషల్ మీడియా వారిని దూరం పెట్టాలని జర్నలిస్టులు నిర్క్షయించి కలెక్టర్ ను కలిసి ఫిర్యాదులు చేశారు. అక్రిడేటెడ్ జర్నలిస్టుల ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ జిల్లా సమాచార పౌర సంబంధాలశాఖ ద్వారా మీడియాకి ప్రాధాన్యత కల్పించాలని యలమంచిలి తహశీల్దార్ కి లేఖరాశారు. 

జిల్లాలో సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ అధికం కావడంతో జర్నలిస్టులకంటే అత్యధికంగా యూట్యూబ్ ఛానల్స్ వాళ్లే ప్రభుత్వ కార్యక్రమాల్లో హడావిడీ చేస్తున్నారని, టివి రంగానికి గానీ, పత్రికా రంగానికి గానీ సంబంధం లేని వారే అధికంగా వస్తున్నారని జర్నలిస్టులు కలెక్టర్ కి చేసిన ఫిర్యాదులో  పేర్కొన్నారు. దీనితో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అనకాపల్లి డిఐపీఓఆర్వో ఇంద్రావతి యలమంచిలి తహశీల్దార్ కి అధికారిక మీడియాకి మాత్రమే ప్రభుత్వ కార్యక్రమాలు, కవరేజిలో ప్రాధాన్యత ఇవ్వాలని లేఖ రాశారు. సామాజిక మాద్యమాల్లో విపరీతంగా ట్రోల్ అవుతున్న ఈ లేఖపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా  అనకాపల్లి జిల్లాలోని యలమంచిలిలో అక్రిడేటెడ్ జర్నలిస్టులు నేరుగా జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయడంతో ఇపుడు అన్ని ప్రాంతాల్లోనూ వర్కింగ్ జర్నలిస్టులు సోషల్ మీడియాని దూరం పెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారట. 

అనకాపల్లి జిల్లా కలెక్టర్ మాదిరిగా ఇతర జిల్లాల్లోనూ మీడియాకి కాకుండా సోషల్ మీడియాని అధికారులు, ప్రజాప్రతినిధులు నియంత్రించగలిగితే మళ్లీ మీడియాకి జవసత్వాలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. అటు జర్నలిస్టులు ఈ రకంగా ఫిర్యాదులు చేయడంపై యూట్యూబ్ ఛానల్స్ నిర్వాహకులు మండి పడుతున్నారు. మేమూ జర్నలిస్టులమే నంటున్నారు. అయితే సోషల్ మీడియాకి మీడియాగా గుర్తింపు లేదు. దానితో అన్నిచోట్లా మీడియాకంటే సోషల్ మీడియాకి చెందిన యూట్యూబ్ ఛానల్స్ అత్యధకంగా కనిపిస్తున్నాయి. చాలా చోట్ల యూట్యూబ్ సంఘాలు కూడా ప్రారంభం కావడం విశేషం. ఎక్కడా లేనివిధంగా అనకాపల్లి జిల్లాలో సోషల్ మీడియాపై మొదలైన తిరుగుబాటు ఇంకా ఎన్ని జిల్లాలకు పాకుతుందనే చర్చ మీడియాలోని వర్కింగ్ జర్నలిస్టులు మధ్య బలంగా సాగుతున్నది.